రెండేండ్ల క్రితం కారు ప్రమాదంలో గాయపడి గతేడాది పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పునరాగమనం చేసిన భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సుమారు 20 నెలల తర్వాత టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌తో ఈనెల 19 నుంచి చెన్నై వేదికగా జరుగబోయే తొలి టెస్టుకు ప్రకటించిన జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు ఆదివారం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మ సారథ్యంలోని 16 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించింది.
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమైన విరాట్ కోహ్లీ తిరిగి జట్టుతో చేరనుండగా టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత ఏస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సైతం చెన్నై టెస్టులో ఆడనున్నాడు. దులీప్ ట్రోఫీలో ఆకట్టుకుంటున్న యూపీ పేసర్ యశ్ దయాళ్ సర్‌ప్రైజ్ ప్యాకేజీగా జట్టులోకి వచ్చాడు. సీనియర్ పేసర్ షమీకి నిరాశ తప్పలేదు.
తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాళ్