🌐 తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోన్న జలయుద్ధం ఇవాళ కీలకమలుపు తిరిగింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఇరిగేషన్‌పై శ్వేతపత్రం ప్రవేశపెట్టి, ప్రజెంటేషన్ ఇచ్చింది.
సాగునీటి శాఖపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ముందు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నోట్ విడుదల చేసింది. కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు, KCR తప్పిదాలు, లోపభూయిష్ట విధానాల పేరుతో ఈ నోట్ విడుదల చేశారు. KCR పాపాలు తెలంగాణకు శాపంగా మారాయంటూ ఈ నోట్ ద్వారా, కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. కృష్ణా బేసిన్‌లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందంటూ రేవంత్ ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోంది. కృష్ణాబేసిన్ ప్రాజెక్టులను KRMBకి అప్పగించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నోట్‌లో వివరించింది. ఛలో నల్గొండ సభకు రేపు గులాబీసైన్యం సన్నద్ధమైన తరుణంలో ఈ పాయింట్‌ను రేవంత్ సర్కార్ ఫోకస్ చేస్తోంది. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నోట్‌లో వివరించింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ నోట్ ద్వారా ప్రభుత్వం చాటిచెబుతోంది. కృష్ణా బేసిన్‌పై నిర్మించిన ప్రాజెక్టులను BRS ప్రభుత్వమే అప్పగించిందనే వాదనను కాంగ్రెస్ ప్రభుత్వం తెరమీదకు తీసుకువచ్చింది. 2015లోనే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను KRMBకి అప్పగించడానికి ముసాయిదా పత్రానికి ఆమోదం తెలిపిందంటూ ENC లేఖను ఉదాహరించింది.