top of page
Suresh D

నాకు టికెట్ రాకపోవడానికి ఆయనే కారణం..

టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కేటాయించిన 6 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో నరసాపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చోటు దక్కలేదు. నరసాపురం లోక్‌సభ స్థానంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మకు టికెట్‌ కేటాయించారు. రాజకీయాలు క్రూరంగా ఉంటాయని తెలిసినప్పటికీ ఇప్పుడు ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చిందని రఘురామరాజు వ్యాఖ్యానించారు. నరసాపురం టికెట్‌ రానందుకు తన అభిమానులు మనస్తాపం చెందవద్దని.. తాను ఎన్నికల బరిలో ఉన్నా, లేకపోయినా ఎన్డీయే విజయం సాధిస్తుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోనే ఉంటానని, జగన్‌కు తగిన గుణపాఠం చెబుతానన్నారు. జగన్‌ ప్రభావం వల్ల నరసాపురం స్థానాన్ని తనకు కేటాయించలేదన్నారు. కొందరు బీజేపీ నేతలకు జగన్‌కు ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందేనని.. ఓ నేత ద్వారా టికెట్‌ రాకుండా అడ్డుకోగలిగినట్లు తెలిసిందన్నారు. నరసాపురం నుంచి పోటీచేస్తానా? మరో స్థానం నుంచా అన్నదానికి కాలమే సమాధానం చెబుతుందన్నారు. జగన్‌ అనుకున్నది మాత్రం జరగనివ్వను అన్నారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కూటమి విజయం సాధిస్తుందని.. జగన్‌ చీప్‌ ట్రిక్స్‌ పనిచేయవన్నారు.

bottom of page