top of page

నడిరోడ్డుపై ఎగిరిపడిన 'ప్రజాపాలన' అఫ్లికేషన్లు.. ఇంత నిర్లక్ష్యమా..?🗣️📰

హైదరాబాద్ బాలానగర్‌లో నడిరోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తులు ప్రత్యక్షమయ్యాయి. ఓ వ్యక్తి బైక్‌పై వాటిని తరలిస్తుండగా.. బాలానగర్ బ్రిడ్జిపై కిందపడిపోయాయి. వాటిని చూసిన వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం కింద ఇచ్చిన హామీల అమలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసందే. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన పేరిట ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులు అందించేందుకు కొన్ని చోట్ల గంటలకొద్ది క్యూలైన్లలో నిలబడి.. ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి తమ అఫ్లికేషన్లను ప్రజలు అధికారులకు అందించారు. 

అయితే.. ప్రజలు అంత కష్టపడి సమర్పించిన ప్రజాపాలన దరఖాస్తులు హైదరాబాద్‌లో నడిరోడ్డుపై ప్రత్యక్షమయ్యాయి. ఓ వ్యక్తి బైక్‌పై వాటిని తరలిస్తుండగా.. రోడ్డుపై ఎగిరిపడ్డాయి. వాటిని చూసిన స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లి వై జంక్షన్‌ వైపు నుంచి వెళ్తుండగా.. బాలానగర్‌ వంతెనపై చిందరవందరగా పడ్డాయి. దీంతో ఆ బైక్‌పై ఉన్న వ్యక్తి కిందపడిన దరఖాస్తులను తీసుకుంటుండగా స్థానికులు గమనించారు.

ర్యాపిడిలో బుక్‌ చేస్తే.. తాను తీసుకొని వెళ్తుండగా అట్టపెట్టె చిరిగి దరఖాస్తులు రోడ్డుపై పడ్డాయని ఆ వ్యక్తి వివరించాడు. ఇతర వివరాలు తెలియదని చెప్పాడు. అట్టపెట్టెలో 500కు పైగా దరఖాస్తులు ఉండగా.. వాటిపై హయత్‌నగర్‌ సర్కిల్‌ పేరు రాసి ఉంది. అసలు సంబంధం లేని ప్రాంతానికి అవి ఎందుకొచ్చాయన్నది ప్రశ్నార్థకమైంది. ప్రజాపాలన దరఖాస్తులు ఇలా నిర్లక్ష్యంగా ఓ చోటు నుంచి మరో చోటుకు తరలించటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము పనులు చెడగొట్టుకొని గంటల తరబడి లైన్లలో నిల్చొని పథకాలు వస్తాయన్న ఆశతో అఫ్లికేషన్లు ఇస్తే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని మండిపడుతున్నారు.

కాగా, ప్రజల నుంచి 1.25 కోట్లకు పైగా ప్రజాపాలన దరఖాస్తులు అందాయి. వాటిని ప్రస్తుతం డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఈనెల 17లోగా వాటిని కంప్యూటర్లలో నిక్షిప్తం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ప్రజాపాలన అమలుపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టితో పాటు మరో ఇద్దరు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.🗣️📰

bottom of page