top of page

ప‌లు జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు..!

గ‌తకొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. రోజురోజుకి భానుడు త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 7కే ఎండ‌లు మండిపోతున్నాయి. ఆ స‌మ‌యంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావటానికి కూడా భ‌య‌ప‌డుతున్నారు. తీవ్రమైన వేడి, వడగాల్పులు, ఉక్క‌బోత‌తో జ‌నం అల్లాడిపోతున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూల్ న్యూస్ చెప్పింది. హైద‌రాబాద్‌లోని పలు జిల్లాల్లో మూడురోజుల‌పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపింది. 

రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఏప్రిల్ 19, 20, 21 తేదీలలో ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుముఖం ప‌డుతాయ‌ని, ఆ మూడురోజులు ప‌లు జిల్లాల్లో వర్షపాతం న‌మోదు అవుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ 19వ తేదిన దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 20, 21వ తేదిల్లో పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోదు కానున్న‌ట్లు అధికారులు తెలిపారు.ఇవాళ, రేపు    హైద‌రాబాద్ న‌గ‌రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావ‌ణ శాఖ వెల్లడించింది. ఈ వర్షాలతో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గే అవ‌కాశం ఉన్న‌ట్లు, 40 నుంచి 36 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు తగ్గే ఛాన్స్ ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ భావిస్తోంది.

bottom of page