top of page

టీఎస్పీయస్సీ వద్ద బర్రెలక్క ఆందోళన.. అరెస్ట్ చేసిన పోలీసులు! వీడియో


టీజీపీఎస్‌సీ కార్యాలయం దగ్గర నిరుద్యోగుల నిరసన మిన్నంటింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిరుద్యోగులకు మద్దతుగా అక్కడికి వచ్చిన బర్రెలక్క ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వాలని, నిరుద్యోగులపట్ల నిర్లక్ష్యం తగదని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీజీపీఎస్‌సీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీషను పోలీసులు, అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను అరెస్ట్‌ చేసి, వాహనంలో స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసులు ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కిస్తున్న సమయంలో ఆమె ‘సీఎం రేవంత్‌ రెడ్డి నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయొద్దంటూ’ నినదించారు. నిరుద్యోగుల తరఫున పోరాడుతుంటే తనను అరెస్టు చేయడం ఏంటని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గ్రూప్స్ పోస్టుల సంఖ్య పెంపుతోపాటు గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి ప్రాతిపదికన అభ్యర్ధుల ఎంపిక, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల, జీవో 46 రద్దు వంటి పలు డిమాండ్లతో నిరుద్యోగులు శుక్రవారం పోరుబాట పట్టారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ (TGPSC) కార్యాలయ ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు భారీ సంఖ్యలో పలు ప్రాంతాల్లో పహారాలో ఉన్నాయి. హైదరాబాదులోని అన్ని రీడింగ్ రూమ్స్, గ్రంథాలయాలు, మెట్రో రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో గుమిగూడిన నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 30 లక్షల మందితో ‘నిరుద్యోగుల మార్చ్‌’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నిరుద్యోగల మార్చ్‌ను ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసింది. జిల్లాల నుంచి యువత రాజధానికి రాకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నది. ఇప్పటికే వందల మందిని అక్రమంగా అరెస్ట్‌ చేసి స్టేషన్లకు తరలించారు. అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌ చుట్టూ పికెటింగ్‌లు ఏర్పాటు చేసి, జిల్లాల నుంచి వస్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. మరోవైపు టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో నిరుద్యోగులకు మద్దతు తెలుపుతూ అక్కడికి వచ్చిన బర్రెలక్క ఆందోళనకు దిగగా.. ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేసి తరలించారు.








Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page