top of page
MediaFx

వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్‌ను ముహూర్తం ఖరారు..


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి ఘన విజయం సాధించిన ప్రధాని మోదీ.. తాజాగా 2024 ఎన్నికల్లో కూడా మరోసారి వారణాసి నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు.  మే 13 వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో నామినేషన్‌ పత్రాలు సమర్పించనున్నట్లు యూపీ బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇక నరేంద్రమ మోదీ నామినేషన్ వేసేందుకు వారణాసిలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు కాషాయ వర్గాలు వెల్లడించాయి. ఈ ర్యాలీకి ముందు ప్రధాని మోదీ.. కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాని నామినేషన్ కోసం యూపీ బీజేపీ ఎంతో ఎదురు చూస్తోంది.

ఇక మోదీ నామినేషన్‌ కోసం ఇప్పటికే యూపీ బీజేపీ యూనిట్‌ అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో.. లోక్‌సభ ఎన్నికల చివరి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ 7 వ దశ పోలింగ్‌కు సంబంధించి.. మే 7 వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుండగా.. 14 వ తేదీ వరకు నామినేషన్లు సమర్పించేందుకు గడువు ఉంది. అంటే గడువు ముగియడానికి ఒకరోజు ముందు మోదీ నామినేషన్‌ వేయనున్నారు. ఇక వారణాసి నియోజకవర్గంలో జూన్‌ 1 వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

బీజేపీ తరఫున వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి యూపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అజయ్‌ రాయ్‌ బరిలో నిలిచారు. అయితే నరేంద్ర మోదీపై 2014 నుంచి వరుసగా మూడోసారి అజయ్‌రాయ్ పోటీ చేస్తుండటం గమనార్హం. 2014 లో 56 శాతం ఓట్లతో ప్రధాని మోదీ గెలుపొందగా.. అప్పుడు అజయ్‌ రాయ్‌కి కేవలం 75 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్‌ కేజ్రీవాల్‌ పోటీ చేయగా.. 3.5 లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి 63 శాతం ఓట్లు రాగా.. అజయ్‌రాయ్‌కి 14శాతం ఓట్లు దక్కాయి.


bottom of page