మహారాష్ట్రలోని షోలాపూర్‌లో 8 అమృత్ ప్రాజెక్ట్‌లకు (AMRUT Scheme) ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (జనవరి 19) శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఇది. అనంతరం మోదీ ప్రసంగిస్తూ చిన్ననాటి రోజులను జ్ఞాపకం చేసుకున్నారు.
ఈ క్రమంలో ఆయన ఒకింత భావోధ్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన-అర్బన్ (PMAY-U) పథకం కింద మహారాష్ట్రలో 90 వేలకుపైగా ఇళ్లను పంపిణీ చేశారు. షోలాపూర్‌లోని రాయ్‌నగర్ హౌసింగ్ సొసైటీకి చెందిన చేనేత కార్మికులు, విక్రేతలు, పవర్ లూమ్ కార్మికులు, ర్యాగ్ పికర్స్, బీడీ కార్మికులు, డ్రైవర్లు, తదితరులకు కొత్తగా నిర్మించిన 15 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. 😊
అనంతరం మోదీ సభలో ప్రసంగించారు.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోనే అతిపెద్ద సొసైటీని ఈ రోజు ప్రారంభించాం. ఇళ్లను చూడటానికి వెళ్లినప్పుడు నా బాల్యం గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తుందా అని అనుకున్నాను.. అంటూ భావోధ్వేగానికి గురయ్యారు. అనంతరం గధ్గత స్వరంతో మాట్లాడుతూ.. కాని నేడు వేలాది కుటుంబాల కలలు నెరవేరడం చూసి నాకు సంతృప్తి కలిగింది. వారి ఆశీర్వాదాలే నాకు అతిపెద్ద ఆస్తి. బడుగు వర్గాల వారికి గృహాలు అందిచాలనే మా నిబద్ధతలో ఒక కీలక మైలురాయి అధిగమించామన్నారు. హౌసింగ్ ప్రాజెక్ట్, ప్రతిష్టాత్మకమైన PMAY-అర్బన్ పథకంలో భాగంగా పట్టణ పేదలకు మౌలిక సదుపాయాలతో కూడిన పక్కా గృహాలను అందించడం ద్వారా వారి గృహ అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. 😊