top of page
Shiva YT

లీగల్ నోటీస్ ఇస్తాం...కాంగ్రెస్‌కు ఫోన్‌పే వార్నింగ్...కారణం ఇదే

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్(Congress) చేపట్టిన ఓ ప్రచార కార్యక్రమంలో ఫోన్‌పే బ్రాండ్‌ను వాడుకోవడంతో ఆ కంపెనీ స్పందించింది.

కాంగ్రెస్ పార్టీకి లీగల్ నోటీస్ ఇస్తామని ఫోన్‌పే(PhonePe) వార్నింగ్ ఇచ్చింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ ప్రచారం జరుగుతోంది. క్యూఆర్ కోడ్‌లో మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫోటోను ఉపయోగించారు. దాని కింద ఫోన్‌పే అని రాశారు. ఈ ప్రచార కార్యక్రమంలో తమ లోగోను ఉపయోగించడంపై ఫోన్‌పే అభ్యంతరం వ్యక్తం చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్‌ను బెదిరించింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఏదైనా పనిచేయడానికి డబ్బును స్వీకరిస్తూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఇవే ఆరోపణలతో మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్ అంతటా పోస్టర్లు వేసింది. పోస్టర్ల పైన "50% లావో, ఫోన్‌పే కామ్ కరో" అని హిందీలో రాసింది. అంటే 50 శాతం కమిషన్ ఇచ్చి పనిచేయించుకోండన్నది ఆ నినాదం సారాంశం. అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అవినీతి ఆరోపణల్లో ఫోన్‌పే లోగోను, పేరును వాడుకోవడం వివాదాస్పదం అవుతోంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఈ పోస్టర్లను ట్విట్టర్ ద్వారా ప్రచారం చేస్తోంది.ఇలా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఫోన్‌పేను వాడుకోవడంపై ఆ కంపెనీ తీవ్రంగా స్పందించింది. పోస్టర్‌పై తన బ్రాండింగ్‌ను ఉపయోగించడంపై ఫోన్‌పే ట్విట్టర్‌లోనే నిరసన తెలిపింది. "ఏదైనా మూడో పక్షం అది రాజకీయమైనా లేదా రాజకీయేతరమైనా మా బ్రాండ్ లోగోను అనధికారికంగా ఉపయోగించడాన్ని ఫోన్‌పే వ్యతిరేకిస్తుంది. మాకు ఎలాంటి రాజకీయ ప్రచారం లేదా రాజకీయ పార్టీతో సంబంధం లేదు" అని ట్విట్టర్‌లో ఫోన్‌పే క్లారిటీ ఇచ్చింది."ఫోన్‌పే లోగో అనేది మా కంపెనీ రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్. ఫోన్‌పే మేధో సంపత్తి హక్కుల అనధికారిక వినియోగం చట్టపరమైన చర్యకు దారితీస్తుంది. మా బ్రాండ్ లోగో, రంగును కలిగి ఉన్న పోస్టర్‌లు, బ్యానర్‌లను తీసివేయమని మేము మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ను వినమ్రంగా అభ్యర్థిస్తున్నాము" అని మరో ట్వీట్ ద్వారా రిక్వెస్ట్ చేసింది ఫోన్‌పే.

bottom of page