గురుకుల విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన టీచర్లే.. విద్యార్థినులను అవమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. రుతుస్రావంలో ఉన్న విద్యార్థినుల బట్టలు విప్పించి ఓ పీఈటీ టీచర్ చితకబాదింది. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సారంపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.
సారంపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న జ్యోత్స్న విద్యార్థినుల పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ప్రార్థనకు ఎందుకు ఆలస్యమైందంటూ విద్యార్థినుల పట్ల విరుచుపడ్డారు. పీరియడ్స్ కారణంగా స్నానం చేయడంలో ఆలస్యమైందని చెప్పినప్పటికీ పీఈటీ వినిపించుకోలేదు. బాత్రూమ్‌లోనే బాధిత విద్యార్థినుల బట్టలు విప్పించి, కర్రతో చితకబాది వీడియోలు తీసినట్లు విద్యార్థినులు చెబుతున్నారు.
పీఈటీ జ్యోత్స్న నిత్యం తమను వేధిస్తోందంటూ విద్యార్థినులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. పీఈటీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీఈటీ జ్యోత్స్న అరాచకాలపై ప్రిన్సిపాల్‌కు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.