top of page
MediaFx

పవన్ కళ్యాణ్‌కి మహేష్ ఫ్యాన్స్ కౌంటర్లు


ఎన్నికలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నామినేషన్ నుంచి పోలింగ్ వరకూ ప్రచారం నుంచి పర్యటనల వరకూ అంతా చాలా పకడ్బందీగా చూసుకోవాలి. లేకపోతే దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో చేసిన కామెంట్లు ఆయన్ను కాస్త ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పబోతూ సూపర్ స్టార్ కృష్ణను తక్కువ చేసేలా పవన్ మాట్లాడారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై మహేష్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. 

తూర్పుగోదావరి రాజానగరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో చాలామంది నటులు ఇతర పార్టీలలో ఉన్నారు. కృష్ణ గారు కాంగ్రెస్‌లో ఉన్నారు, కోటా శ్రీనివాసరావు గారు వేరే పార్టీలో ఉన్నారు. కృష్ణ గారు ఎన్టీఆర్‌పై ఎన్ని విమర్శలు చేసినా వారిని ఎన్టీఆర్ ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. అదీ ఎన్టీఆర్ సంస్కారం" అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక దీన్ని వైసీపీ నేతలు తమకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం గట్టిగానే చేశారు. "తనని విమర్శించినా కృష్ణ గారిని ఎన్టీఆర్ ఏమనలేదు అదీ ఆయన సంస్కారం అని పవన్ అంటున్నారు.. అంటే ఎన్టీఆర్‌ను విమర్శించిన కృష్ణగారికి సంస్కారం లేదని పవన్ ఇండైరెక్ట్‌గా చెబుతున్నారా?" అంటూ వైసీపీ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టింది. ఇక దీనిపై మహేష్ ఫ్యాన్స్ కూడా తాజాగా పవన్ కళ్యాణ్‌కి కౌంటర్లు వేస్తున్నారు. 

మీ ఎన్నికల ప్రచారంలోకి సూపర్ స్టార్ కృష్ణను లాగాల్సిన అవసరం ఏముందంటూ పవన్‌ను ప్రశ్నిస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. అంతేకాకుండా మరి ఎన్టీఆర్‌ను అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా చాలా సార్లు విమర్శించారంటూ ఆ వీడియోలు కూడా పోస్టు చేస్తున్నారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ తనని చాలా ఇబ్బంది పెట్టారని, అందుకే ఆయనకి దూరంగా ఉన్నానంటూ అక్కినేని చెప్పుకొచ్చారు.

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శల సహజమని.. తిరిగి తిట్టనంత మాత్రాన సంస్కారం ఉన్నట్లు, తిట్టినంత మాత్రాన లేనట్లు కాదని పవన్‌కి సెటైర్లు వేస్తున్నారు. అయినా ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు కానీ ఇలా వివాదరహితుడైన సూపర్ స్టార్ కృష్ణను మధ్యలోకి లాగడం పవన్‌ను ఖచ్చితంగా ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి!.

bottom of page