top of page

డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్‌స్టా పోస్ట్..ఏం షేర్ చేసారో తెలుసా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కూటమి భారీ విజయాన్ని సాధించింది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంలో ఇప్పటికే ఆయా మంత్రులకు శాఖలు కేటాయించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి అండ్ గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర & సాంకేతిక శాఖల మంత్రిగా నియమించారు. అలాగే డిప్యూటీ సీఎం పదవి కేటాయించగా.. నిన్న విజయవాడలోని డీప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పవర్ స్టార్ కు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

ఇదిలా ఉంటే పవర్ స్టార్ అటు సినిమాలు లేదంటే రాజకీయాలతో బిజీగా ఉంటారు. కానీ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండరు. చాలా కాలం నుంచి ట్విట్టర్ ఉపయోగిస్తున్న పవన్.. కొద్ది రోజుల క్రితమే ఇన్ స్టా ఓపెన్ చేశారు. ఇందులో కేవల రాజకీయాలకు సంబంధించినవి, సినిమాల విషయాలు మాత్రమే పోస్ట్ చేస్తుంటారు. అది కూడా చాలా అరుదు. తాజాగా డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ తన ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేశారు.

నిన్న డీప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వీడియోను షేర్ చేసారు. పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి తన ఛాంబర్ వరకు రావడం, పూజలు నిర్వహించడం, ఫైల్స్ మీద సంతకాలు చేయడం, పలువురు అధికారులను కలవడం చూపిస్తూ ఆ వీడియోను షేర్ చేశారు. “ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర & సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నందుకు గౌరవంగా ఉంది. ఇప్పుడు నా బాధ్యతలు మరింత పెరిగాయి. నేను నా రాష్ట్రానికి బాధ్యతతో పనిచేస్తాను. ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page