సిఎం..సిఎం అని అరిస్తే నేను ముఖ్యమంత్రిని కాలేను.. మీరంతా నాకు ఓట్లు వేసి గెలిపించాలి.. ఇది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నోట ఇటీవల సభల్లో తరుచుగా వినిపిస్తున్న మాట. అయితే సిఎం కావడం అటుంచితే అసలు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేరన్నది ఆయన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతల నుంచి వస్తున్నమాట. అయితే ఈసారి తన గెలుపును ఎవరు ఆపలేరు.. జనసేన అసెంబ్లీ లో అడుగు పెట్టటం ఖాయం అని ఇటీవల తన వారాహి యాత్ర సందర్భంగా శపధం చేసిన పవన్ కళ్యాణ్.
తన మొత్తం 15 రోజుల పర్యటన లో నాలుగు రోజుల పాటు భీమవరంలోనే బస చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత అనారోగ్యంగా ఉందని , 102 డిగ్రీల జ్వరంతో ఆయన బాధపడుతున్నారని జనసేన నేతలు ఈ సందర్భంగా బయటకు చెప్పారు. అయితే ఇదే సందర్భంలో వివిధ వర్గాల ప్రజలను కలుసుకోవటం పక్కన పెడితే ” బ్రో ” సినిమా టీజర్ కు అయన డబ్బింగ్ చెప్పటం అయనకు భీమవరంలో ప్రధాన ప్రత్యర్థి అయిన గ్రంధి శ్రీనివాస్ కు ఆయుధంగా మారింది. ఇది రాజకీయపరమైన విమర్శగా పక్కన పెట్టినా.. పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై పార్టీ నేతలకు క్లారిటీ వచ్చేసిందన్నది ఇపుడు భీమవరం కేంద్రంగా బయట జరుగుతున్న ప్రచారం. పవన్ మళ్లీ భీమవరం బరిలోనే నిలుస్తారంటూ బలమైన సంకేతాలు సైతం ఆ పార్టీ నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా రెండో దఫా వారాహి విజయ యాత్ర షెడ్యూల్ రేపో, మాపో విడుదలవుతుంది. అది భీమవరం నుంచి మొదలైనా లేదా ఏలూరులో మొదలై ఉంగుటూరు , తాడేపల్లిగూడెం , తణుకు, ఆచంట మీదుగా భీమవరం చేరుకున్నాక రెండు రోజుల పాటు భీమవరంలోనే పవన్ కళ్యాణ్ బస చేయటం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే సందర్భంలో కేవలం నేతలను మాత్రమే కాకుండా పవన్ కార్యకర్తలను సైతం కలుస్తారని ప్రచారం జరుగుతుంది.