పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీకి ఆయన నుంచి ఒక్క సినిమా ఎక్స్‌పెక్ట్ చేయడమే క్రైమ్ అవుతుందేమో..? అలాంటిది ఒప్పుకున్న మూడు సినిమాల పరిస్థితేంటి..? పైగా అందులో రెండు సినిమాలు రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు..? మరి వాటి పరిస్థితేంటి..? రెండో భాగం ఉంటుందా లేదా..? అసలు మొదటి భాగాలు ఎప్పుడు రానున్నాయి..?
కొన్ని నెలలుగా రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. పైగా ఆయనిప్పుడు ఏపీకి ఉప ముఖ్యమంత్రి కూడా. దానికితోడు చాలా బాధ్యతలు తీసుకున్నారు. దాంతో ఇప్పుడు పవన్ ఉన్న బిజీకి ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ ఇవ్వడం అనేది కష్టమైన పనే. అయినా కూడా ప్రయత్నిస్తానని ఆ మధ్య చెప్పారు పవన్.
బ్రో విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. వీరమల్లు, ఓజి షూటింగ్ చేసినా.. కొన్ని రోజులే. కానీ వాటిలో మిగిలిన పోర్షన్ కూడా కొంతే. వీలు చూసుకుని వారానికి 2,3 రోజులు డేట్స్ ఇస్తానని చెప్పారు పవన్. ఇదంతా బాగానే ఉంది.. కానీ ఈ రెండు సినిమాలకు రెండో భాగం ఉంది. వాటి పరిస్థితేంటి అనేది అగమ్యగోచరంగా మారిందిప్పుడు.
పవన్ ఎప్పుడొచ్చినా.. షూటింగ్ చేసేలా ఇటు వీరమల్లు టీం, అటు సుజీత్ వేచి చూస్తున్నారు. మరో 20 రోజులు షూట్ చేస్తే.. హరిహర వీరమల్లు పార్ట్ 1 అయిపోతుంది. అలాగే ఓజికి కూడా రెండు మూడు వారాలు షూట్ చేస్తే చాలు. ఎలాగోలా వీటిని పూర్తి చేయాలని చూస్తున్నారు పవర్ స్టార్. కానీ సీక్వెల్స్‌కు డేట్స్ మాత్రం కష్టమే. ఎందుకంటే పవన్‌కు ఇప్పుడు టైమ్ బంగారం కంటే విలువైంది.
హరిహర వీరమల్లుకు సీక్వెల్ ఉందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కానీ ఓజికి ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఒక్క పార్ట్‌లోనే దీన్ని సుజీత్ పూర్తి చేస్తారా అనేది ఆసక్తికరమే. మరోవైపు ఓజీకి ప్రీక్వెల్ అకీరా నందన్‌తో చేస్తే ఎలా ఉంటుందనే చర్చలు కూడా నడుస్తున్నాయి. మొత్తానికి పవన్ డేట్స్ హాట్ కేక్స్ ఇప్పుడు. ఏం జరుగుతుందో చూడాలిక.