top of page

అయ్యయ్యో.. గూగుల్‌ తల్లిని నమ్ముకుంటే నట్టేట నిండా ముంచేసిందే..! నేరుగా ఏట్లోకి..


కేరళ కాసర్‌గోఢ్‌ జిల్లాకు చెందిన అబ్దుల్‌ రషీద్‌ అనే యువకుడితో పాటు తష్రీఫ్ అనే మరో యువకుడు ఆదివారం తెల్లవారు జామున 6 గంటలకు పొరుగన ఉన్న కర్ణాటకలోని ఆసుపత్రికి బయల్దేరారు. గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా కారులో డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లసాగారు. ఈ క్రమంలో వీరి కారు గత గురువారం తెల్లవారుజామున కాసర్‌గోడ్‌లోని పల్లంచి ఫారెస్ట్ రోడ్డు పక్కనున్న నదిలో పడిపోయింది. నదిలో నీటి ప్రవాహం ఆధృతంగా ఉండటంతో వీరికారు నీటిలో కొట్టుకుపోయి ఓ చెట్టుకు చిక్కుకుపోయింది. దీంతో వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. వారు అక్కడికి చేరుకుని యువకులను కాపాడటంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆస్పత్రికి వెళ్లే క్రమంలో గూగుల్‌ మ్యాప్స్‌ తమను ఇరుకైన దారిగుండా తీసుకెళ్లిందని, వాహనం హెడ్‌లైట్‌ వెలుగులో ముందు కొంచెం నీరు కనిపించిందని, అయితే అది నదిపై ఉన్న వంతెనగా తాము ఊహించలేకపోయామని ఆ ఇద్దరు యువకులు చెప్పుకొచ్చారు. రెండు వైపులా నీరు ఉండటం, చుట్టూ అంతా చీకటిగా ఉండటంతో, వంతెనపై సైడ్‌వాల్‌ సైతం కనిపించలేదని చెప్పారు. ఆ తర్వాత కారు అకస్మాత్తుగా నీటిలో కొట్టుకుపోయిందని.. నది ఒడ్డున చెట్టుకు చిక్కుకుకుపోవడంతో, విండో కిటికీలు కిందికి దించి చెట్టుకొమ్మలు పట్టుకుని తప్పించుకున్నామని తెలిపారు.

ప్రమాదం గురించి తమ బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించగా.. వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారని, అగ్నిమాక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని తాళ్లతో తమని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని, ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదని, ఇది నిజంగా పునర్జన్మ అని రషీద్‌ తెలిపాడు. కాగా నాలుగేళ్ల క్రితం ప్రమాద స్థలం నుంచి 500 మీటర్ల దూరంలో కొత్తగా ఎత్తైన వంతెన నిర్మించారు. అయితే Google Maps మాత్రం ఇప్పటికీ పాత వంతెన మార్గానే చూపిస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది. కేరళలో ఇలాంటి ఘటన జరగడం ఇదేం మొదటిసారి కాదు. గత నెలలో హైదరాబాద్ నుంచి వచ్చిన టూరిస్ట్‌ బృందం ప్రయాణిస్తున్న కారు.. గూగుల్ మ్యాప్స్ ఉపయోగించడం వల్ల కొట్టాయంలోని కురుప్పంతర సమీపంలో ఉబ్బిన ప్రవాహంలోకి దూసుకుపోయింది. సమీపంలోని పోలీసు పెట్రోలింగ్ యూనిట్ ఉండటంతో వారంత క్షేమంగా తప్పించుకోగలిగారు. కానీ వారి వాహనం నీళ్లలో కొట్టుకుపోయింది.

Comments


bottom of page