ప్రభాస్ అభిమానులకు ఈ రోజు రెండు గుడ్ న్యూస్ లు అందాయి. డార్లింగ్- హను రాఘవ పూడి సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావడం ఒకటైతే.. మరొకటి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న బ్లాక్ బస్టర్ కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రావడం. ఆగస్టు 15 నాటికి ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. అంటే దాదాపు థియేట్రికల్ రన్ ముగిసినట్టే. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఇంకా డార్లింగ్ మూవీ ఆడుతోంది. ఈ నేపథ్యంలో కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఆగస్టు 3 వారంలో ప్రభాస్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. అయితే ఆగస్టు 23న కాకుండా ఒక రోజు ముందే అంటే ఆగస్టు 22 నుంచే కల్కి మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. కల్కి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే హిందీ వెర్షన్ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 22 నుంచి కల్కి సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ తో పాటు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్లను కూడా రిలీజ్ చేశాయి. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ తదితరులు క్యామియో రోల్స్ లో మెరిశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుమారు రూ. 700 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కల్కి సినిమాను నిర్మించారు. ఓవరాల్ గా ఈ సినిమాకు రూ.1200 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. మరి థియేటర్లలో కల్కి సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకో 5 రోజులు ఆగండి.