top of page
MediaFx

నమితకు చేదు అనుభవం.. మధురై ఆలయంలోకి రానివ్వలేదంటూ నటి ఆవేదన


ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు నమితకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లిన తనను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వివరాలను వెల్లడించారు. తనతో పాటు కుటుంబ సభ్యులను హిందూ కుల ధ్రువీకరణపత్రం అడిగారని చెప్పారు. దురుసుగా, అహంకారపూరితంగా సిబ్బంది, అధికారులు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పుట్టుకతోనే హిందువునేనని.. తనతో అగౌరవంగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆలయ అధికారుల తీరు తనను ఎంతో బాధకు గురి చేసిందని నమిత పేర్కొంది. అయితే, ఈ ఘటనపై ఆలయ పరిపాలన స్పందించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము అలా వ్యవహరించామని.. కొంత సమయం వేచి ఉండాలని తాము చెప్పామని.. అడ్డుకోలేదన్నారు. నమితతో మర్యాదపూర్వకంగానే వ్యవహరించామన్నారు. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతు తెలిపారు. పలువురు క్షమించాలని సూచించారు. ఈ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. నమిత స్వస్థలం గుజరాత్‌లోని సూరత్‌. ఆమె 2002లో సొంతం మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వెంకటేశ్‌ సరసన ‘జెమిని’ మూవీలో నటించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మలయాళ సినిమాల్లోనూ నటించింది. తెలుగులో చివరిసారిగా సింహా మూవీలో నటించింది. నమిత 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కవలలు ఉన్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. కొద్దిరోజుల కిందట బీజేపీలో చేరింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.





bottom of page