top of page

తొలిసారి బ్రిటిష్ కొత్త ప్రధానితో మాట్లాడిన మోదీ..


బ్రిటన్ కొత్త ప్రధాని కైర్ స్టార్మర్ (Keir Starmer) శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో (PM Narendra Modi) ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా.. మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ పర్యటనకు రావాలని కోరారు. అంతేకాదు.. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (Free Trade Agreement) కుదుర్చుకోవడానికి తమ యునైటెడ్ కింగ్‌డమ్ సిద్ధంగానే ఉందని స్టార్‌మర్ చెప్పారు. ఈ విషయాలను స్వయంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘‘బ్రిటన్ నూతన ప్రధాని కైర్ స్టార్మర్‌తో ఫోన్‌లో మాట్లాడటం సంతోషంగా ఉంది. యూకే కొత్త ప్రధానిగా ఎన్నికైనందుకు ఆయన శుభాకాంక్షలు తెలిపాను. ప్రజల శ్రేయస్సుతో పాటు ప్రపంచం మంచి కోసం.. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక సంబంధాలను మరింతగా బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు.. ఇరుదేశాల మధ్య బలమైన, గౌరవప్రదమైన సంబంధాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు తాను ఎదురుచూస్తున్నానని స్టార్మర్ చెప్పినట్లు ఓ ప్రతినిధి తెలిపారు. వాతావరణ మార్పు, ఆర్థిక వృద్ధి వంటి కీలక ప్రపంచ సవాళ్లపై ప్రధాని మోదీ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నానని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. అలాగే.. ఇరుదేశాల మధ్య చారిత్రక సంబంధాలను ఇద్దరు ప్రధానులు గుర్తు చేసుకున్నారని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పరస్పర ప్రయోజనకరమైన ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ)’ వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చేందుకు కృషి చేయాలని వాళ్లిద్దరు అంగీకరించారని పేర్కొంది. ఇరుదేశాల్లోని ప్రజల మధ్య సన్నిహిత సంబంధాల్ని ప్రోత్సహించడాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. 2030 రోడ్‌మ్యాప్ ప్రాముఖ్యత గురించి కూడా చర్చించినట్లు వెల్లడించారు. ఇరుదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం కోసం.. మోదీ, స్టార్మర్ వీలైనంత త్వరగా కలుసుకోవాలని చూస్తున్నారని విదేశాంఖ శాఖ చెప్పుకొచ్చింది.

ఇదిలావుండగా.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కన్జర్వేటివ్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంతో భారతదేశం గత రెండు సంవత్సరాల నుంచి చర్చలు జరుపుతూ వచ్చింది. అయితే.. ఇరుదేశాల్లో ఎన్నికలు రావడంతో.. 14వ రౌండ్‌లో ఆ చర్చలు నిలిచిపోయాయి. అయితే.. ఇటీవల బ్రిటన్‌లో జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 23.7 శాతం ఓట్లతో 121 సీట్లే దక్కించుకుంది. లేబర్ పార్టీ మాత్రం 650 స్థానాలకు 33.7 శాతం ఓట్లతో 412 సీట్లు దక్కించుకోవడంతో.. ఆ పార్టీ అధ్యక్షుడు కైర్ స్టార్మర్‌ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే.. ప్రధానితో ఆయన ఫోన్‌లో మాట్లాడారు.

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page