top of page

సరికొత్త ప్రధానిని మోదీలో చూడబోతున్నామా..?


దేశప్రధానిగా అయినా….గుజరాత్ ముఖ్యమంత్రిగా అయినా..తిరుగులేని మెజార్టీతో పాలించడమే మోదీకి తెలుసు. బీజేపీకి సరిపడా మెజార్టీ ఉండడంతో మోదీ 1.0, 2.0 అయినా ఎలాంటి ఆటంకాలూ లేకుండా సాగింది. కానీ మోదీ 3.0 అందుకు భిన్నం. 240 స్థానాలు సొంతంగా ఉన్నప్పటికీ…మిగిలిన 32 స్థానాల కోసం మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి.

సొంత పార్టీ ప్రభుత్వానికి కాకుండా..సంకీర్ణానికి సారధ్యం వహిస్తున్నారు. ఏకఛత్రాధిపత్యం తరహా పాలనకు అలవాటుపడ్డ ప్రధాని మోదీ…సంకీర్ణ ధర్మాన్ని సమర్థవంతంగా పాటించగలరా..? వాజ్‌పేయి తరహాలో నొప్పింపక, తానొవ్వక విధానంలో పాలన సాగించగలరా..? పట్టువిడుపులు ప్రదర్శిస్తూ…అందరినీ కలుపుకుపోతూ…సాగే సరికొత్త ప్రధానిని మోదీలో చూడబోతున్నామా..?

అప్పటి నుంచి సంకీర్ణ రాజకీయాలే..దేశంలో 1984 తర్వాతి నుంచి సంకీర్ణ రాజకీయాలే. ఇందిరాగాంధీ మరణించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 404 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత ఇంకెప్పుడూ దేశంలో ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజార్టీ సాధించలేదు. 2014 వరకూ దేశంలో సంకీర్ణ రాజకీయాల శకమే నడిచింది. 1989-2014 మధ్య కాంగ్రెస్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలకే సారథ్యం వహించాయి. కానీ 2014లో రాజకీయం మారిపోయింది. దేశంలో బీజేపీ అతిపెద్ద జాతీయ పార్టీగా నిలిచింది.

జాతీయ పార్టీలు దేశం మొత్తం కలిపి 200 సీట్లు సాధించడమే కష్టంగా ఉన్న అప్పటి పరిస్థితుల్లో బీజేపీ సొంతంగా 282 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 272 స్థానాలు కన్నా ఎక్కువగా 10 చోట్ల గెలుపొంది మిత్రపక్షాలతో పనిలేకుండా ప్రభుత్వం ఏర్పాటుచేయగలిగే స్థితిలో నిలిచింది. వరుసగా 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి….తర్వాత బీజేపీ ప్రధాన అభ్యర్థిగా మారి దేశవ్యాప్తంగా మోదీ పెంచుకున్న చరిష్మాతోనే ఆ ఘనవిజయం సాధ్యమయిందన్నది అంగీకరించి తీరాల్సిన నిజం. ముఖ్యమంత్రిగా గుజరాత్‌ను అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టించిన విధానం దేశవ్యాప్తంగా ఆదరణ పెంచింది. గుజరాత్ మోడల్ 2014లో ఎన్నికల నినాదంగా మారింది.

మెజార్టీ సాధించినప్పటికీసొంతంగా కావల్సిన మెజార్టీ సాధించినప్పటికీ 2014లో క్యాబినెట్‌లో మిత్రపక్షాలకు చోటు కల్పించారు ప్రధాని. మిత్రపక్షాలను కలుపుకుపోయారు. మేకిన్ ఇండియా, స్వచ్ఛభారత్ అభియాన్, నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, సంస్కరణలకు పెద్దపీట వేయడం, ప్రయివేటీకరణకు ప్రోత్సాహం వంటివాటితో పాలనపై మొదటి ఐదేళ్ల కాలంలో తన మార్క్ చూపించారు మోదీ. విదేశాంగవిధానంలో భారత్‌ను బలంగా తీర్చిదిద్దారు. విస్తృత విదేశీ పర్యటనలు, పెట్టుబడుల ఒప్పందాలతో అంతర్జాతీయంగా భారత్‌కు ప్రత్యేక గుర్తింపు సాధించారు.

ఈ విజయాలు 2019లో సైనికులపై జరిగిన పుల్వామా దాడికి ప్రతీకారంగా చేపట్టిన బాలాకోట్ దాడులు వంటివన్నీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఓ వ్యక్తిలా కాకుండా తిరుగులేని శక్తిలా నిలిపాయి. దేశవ్యాప్తంగా కమలదళానికి ఓట్ల వర్షం కురిసింది. బీజేపీ ఆధిపత్యం ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో ఓట్ల వరద పారింది.

ఫలితంగా బీజేపీ 303 సీట్లు సాధించి….అంచనాలను తలకిందులు చేసింది. 1984లో రెండు సీట్లు సాధించిన బీజేపీ…..తర్వాత కాలంలో అధికారం సంపాదించినప్పటికీ.. 330 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవడానికి మోదీకున్న ప్రజాకర్షణ, ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణం. భారీ సీట్లతో గెలిచిన తర్వాత కూడా బీజేపీ మిత్రపక్షాలను దూరం పెట్టలేదు. కలిసివచ్చే పార్టీలన్నింటినీ కలుపుకునేసాగింది.

చిరకాల లక్ష్యాల సాధన దిశగారెండోసారి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే.. బీజేపీ చిరకాల లక్ష్యాల సాధన దిశగా ప్రధాని మోదీ అడుగులు వేశారు. ఆర్టికల్ 370 ఎత్తివేత, అయోధ్యలో రామాలయం నిర్మాణం, సీఏఏ వంటివి ఆచరణసాధ్యం చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దు, కొత్త పార్లమెంట్ భవనం, మహిళా రిజర్వేషన్ల వంటివి చేసిచూపారు. స్వతంత్ర, బలమైన విదేశాంగవిధానంతో అమెరికా ఢీ అంటే ఢీ అనే స్థాయిలో భారత్‌ను నిలబెట్టారు. భారత్ వ్యతిరేక ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలకు బుద్ధి చెప్పారు.

మొత్తంగా కొత్త ఇండియాను భారత్‌ను తీర్చిదిద్దారు. పాలనపరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే దేశవ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేశారు. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో బీజేపీని ఆసేతుహిమాచలం అధికారంలో తెచ్చే ప్రయత్నాలు చేశారు. ప్రాంతీయపార్టీలను కలుపుకుని…రాష్ట్రాల్లోనూ బీజేపీకి అధికారపీఠం కట్టబెట్టారు. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో కాషాయదళాన్ని పరుగులు పెట్టించారు. సొంతంగా 370 సీట్లు సాధించడం లక్ష్యంగా పెట్టుకుని ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగారు. ఇక్కడే ప్రధాని మోదీ…. అమిత్‌షా, జేపీ నద్దాతో కలిసి తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు.

భారత్‌లాంటి పెద్ద దేశంలో ఓ జాతీయపార్టీ రెండుసార్లు వరుసగా అధికారంలో ఉండి…. మూడోసారి మళ్లీ గెలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. అదీ కరోనాలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నతర్వాత, అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ధరల పెరుగుదల వంటి సమస్యలున్నప్పుడు గెలుపు అంత తేలిక కాదు. రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రభుత్వ వ్యతిరేకత సహజ అంశం. ఇక్కడే ప్రధాని మోదీ అత్యంత తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు.

ఓ పక్క సొంతంగా 370, కూటమిగా 400 సీట్లు గెలవడమే లక్ష్యమని ప్రకటిస్తూనే..మరోపక్క ముందు జాగ్రత్తగా కొత్త పొత్తుల వేటలో పడ్డారు. ఓట్లు రాబట్టుకునేందుకు అంచనాలకు అందని రాజకీయ సమీకరణాలు వేసి..సఫలీకృతం అయ్యారు. మోదీ 3.0లో కొత్తుగా పొత్తు పెట్టుకున్న పార్టీలక వచ్చిన సీట్లు, తద్వారా బీజేపీ పొందిన ఓట్లే కీలకంగా మారాయంటే..మోదీ ముందుచూపు ఎలా ఉందో..రాబోయే పరిణామాలను ఎంత కచ్చితంగా అంచనావేశారో అర్ధం చేసుకోవచ్చు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page