top of page

మిస్ ఇండియా విజేతల్లో వారు లేరు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు..


కులగణన డిమాండ్ చేస్తూ ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన “సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్”లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో 90 శాతం ఉన్న దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాల ప్రజలకు తగిన వాటా దక్కడం లేదని అన్నారు. ఈ క్రమంలో కొన్ని రంగాలను ఉదహరిస్తూ.. ” నేను మిస్ ఇండియా జాబితాను పరిశీలించాను. అందులో ఒక్కరు కూడా దళితులు, ఆదివాసీలు లేరు. చివరకు ఓబీసీలు కూడా కనిపించలేదు. కొందరు బాలీవుడ్ గురించో, క్రికెట్ గురించో మాట్లాడతారు. చెప్పులు కుట్టేవారి గురించి లేదా ప్లంబర్ గురించి ఏ ఒక్కరూ చూపించరు. చివరకు మీడియాలో ఉన్న టాప్ యాంకర్లు దేశంలో 90 శాతం జనాభా ఉన్న వర్గాలకు చెందినవారు కాదు” అన్నారు. అలాగే “సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, బాలీవుడ్, మిస్ ఇండియా వంటి వాటిలో 90 శాతం జనాభా కల్గిన వర్గాల నుంచి ఎంత మంది ఉన్నారో తెలియాలి. ఈ 90 శాతం జనాభా కల్గిన వర్గాలకు తగిన వాటా దక్కుతుందా లేదా అన్నది పరిశీలించాలి” అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆయనది బాల బుద్ధి

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు స్పందించారు. ఆయన మాట్లాడే ముందు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. దేశ ప్రధాని ఓబీసీ వర్గానికి చెందినవారని, రాష్ట్రపతిగా మొట్టమొదటిసారి గిరిజన ఆదివాసీ మహిళ ఉన్నారని, కేంద్ర మంత్రివర్గంలో రికార్డు సంఖ్యలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు ఉన్నారని గుర్తుచేశారు. మిస్ ఇండియా, సినిమాలు, క్రీడలు వంటి పోటీలపై మాట్లాడుతున్న రాహుల్ గాంధీ.. అందులో రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇది రాహుల్ గాంధీ ‘బాల బుద్ధి’ (చిన్నపిల్లల మనస్తత్వం) తప్ప మరేమీ కాదని, ఆయన వ్యాఖ్యలకు కేరింతలు కొట్టేవాళ్లు కూడా అంతేనని ఘాటుగా స్పందించారు. “చిన్నపిల్లల మనస్తత్వం చూసేవారికి వినోదాన్ని పంచుతుంది. కానీ ఈ తరహా సమాజ విభజనవాదంతో వెనుకబడిన వర్గాలను హేళన చేయవద్దు” అంటూ హితవు పలికారు. దీనికి కొనసాగింపుగా.. “మిస్ ఇండియాలను, ఒలింపిక్స్‌కు వెళ్లే క్రీడాకారులను, సినిమాల్లో నటించే నటులను ప్రభుత్వాలు ఎంపిక చేయవు.. ఈ విషయం తెలుసుకోండి” అని పేర్కొన్నారు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో కిరెన్ రిజిజు చేసిన ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.



Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page