top of page
Suresh D

జైలు నుంచే సీఎం పాలన..


మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. జైలు నుంచే పాలన సాగిస్తారని ఆప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గత మూడు రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న ఆయన.. జైలు నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆదివారంతొలి ఉత్తర్వును సీఎం వెలువరించారు. ఢిల్లీలో తాగునీటి సరఫరాకు సంబంధించిన ఈ ఉత్తర్వును నీటి వనరుల శాఖ మంత్రి అతీషికి కేజ్రీవాల్ పంపారు. సీఎం నుంచి నోట్ వచ్చిన కాసేపటికే మంత్రి అతీషి మీడియా సమావేశం ఏర్పాటుచేసి.. బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నగరంలోని నీటి సరఫరాపై ఆరా తీశారు. కొన్ని ప్రాంతాల్లో సమస్య ఉందని తెలుసుకుని అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.. ఏయే ప్రాంతాల్లో అయితే సమస్య ఉందో అక్కడ సరిపడా వాటర్ ట్యాంక్‌లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన తన గురించి ఆలోచించడంలేదు.. ఢిల్లీ ప్రజల సమస్యల గురించే ఆరా తీస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేసినంత మాత్రాన ఢిల్లీ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు’’ అని అతిషి కన్నీళ్లు పెట్టుకున్నారు.

bottom of page