top of page
MediaFx

మెగాస్టార్ అనూహ్య నిర్ణయం

పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతంగా కొనసాగుతోంది. అన్ని పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల తీవ్రతను పెంచాయి. అదే సమయంలో నామినేషన్ల పర్వం కూడా జోరెత్తింది. మూడొంతులకు పైగా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్లను దాఖలు చేయడానికి ఈ నెల 25వ తేదీ తుది గడువు. నామిషన్లను వేయడానికి ఇంకో రెండు రోజులే మిగిలివుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నేడు పవన్ కల్యాణ్ నామినేషన్ వేయనున్నారు. 

ఈ నేపథ్యంలో- మెగాస్టార్ చిరంజీవి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారానికి ఆయన తరలిరానున్నారు. తెలుగుదేశం-జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీలో నిలిచిన పవన్ కల్యాణ్ తరఫున చిరంజీవి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. చిరంజీవి క్యాంపెయిన్.. పిఠాపురం వరకే పరిమితం కాకపోవచ్చు. టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి తరఫున ఆయన ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పరోక్షంగా కూటమి అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ క్యాండిడేట్ పంచకర్ల రమేష్ బాబుకు అండగా నిలిచారు. ఈ ఎన్నికల్లో వారిని గెలిపించాలంటూ ఇటీవలే ఓ వీడియో విడుదల చేశారు. ఈ సారి పిఠాపురంతో పాటు కాపు సామాజికవర్గ ఓటుబ్యాంకు అధికంగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల తరఫున చిరంజీవి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. అనకాపల్లి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలన్నింట్లోనూ సుడిగాలి ప్రచారంలో పాల్గొంటారని అంటోన్నారు. 

Comments


bottom of page