top of page

విపక్షాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు


ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. తనపై దాడులు అవినీతి వ్యతిరేక పోరాటాన్ని ఆపలేవని, అక్రమాలకు పాల్పడిన వారిపై వారి హోదాతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అవినీతికి వ్యతిరేకంగా మోదీ పూర్తి శక్తితో పోరాడుతున్నప్పుడు ఈ వ్యక్తులు ఇండియా కూటమిని ఏర్పాటు చేశారు.. మోదీని భయపెడతామని వారు భావిస్తున్నారు... కానీ భారతదేశం నా కుటుంబం.. దానిని అవినీతిపరుల నుంచి రక్షించడానికి నేను చర్యలు తీసుకుంటున్నాను’ అని అన్నారు. 

ప్రధాని నియంతృత్వ విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌ల అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు చేపట్టిన ర్యాలీపై ప్రధాని మోదీ ఎదురుదాడికి దిగారు. అవినీతికి వ్యతిరేకంగా తాను చర్యలు తీసుకుంటున్నందున కొంతమంది ప్రజలు విస్తుపోతున్నారని మోదీ దుయ్యబట్టారు. ‘నా దేశాన్ని అవినీతిపరుల నుంచి రక్షించడానికి నేను పెద్ద యుద్ధం చేస్తున్నాను.. అందుకే వారు నేడు కటకటాల వెనుక ఉన్నారు.. సుప్రీంకోర్టు నుంచి కూడా బెయిల్ పొందలేరు’ అని పరోక్షంగా కేజ్రీవాల్ అరెస్ట్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు.

bottom of page