top of page
MediaFx

లోక్‌సభ ఐదోదశ పోలింగ్‌ ప్రారంభం..బరిలో 659 మంది అభ్యర్ధులు..


లోక్‌సభ ఎన్నికలు ఐదో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. . ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 49 లోక్‌సభ నియోజకవర్గాలకు కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ 49 స్థానాల్లో 40 స్థానాలు ఎన్డీయే సిట్టింగ్‌ స్థానాలు కావడంతో బీజేపీకి ఈ దశ చాలా కీలకంగా మారింది. ఈ విడత ఉత్తరప్రదేశ్‌లో 14 , మహారాష్ట్రలో 13, బెంగాల్‌లో 7, బిహార్, ఒడిశాలో 5, ఝార్ఖండ్ 3 స్థానాలతో పాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో ఒక్కో నియోజక వర్గానికి పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో 659 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఐదో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న కీలక నేతల జాబితాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయబరేలీ బరిలో నిలిచారు. ఇక రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీ నుంచి , ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలుప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరన్ లోక్ సభ స్థానం నుంచి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్ బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తం 94 వేల 732 పోలింగ్‌ స్టేషన్‌లలో 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒడిశాలోని ఐదు లోక్‌సభ స్థానాలతో పాటు 35 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. సీఎం నవీన్‌ పట్నాయక్‌ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు.

ఐదో దశ లోక్​సభ ఎన్నికల్లో ఓటర్లందరూ కొత్త రికార్డు క్రియేట్ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. లోక్‌సభ ఎన్నికలు ఐదో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు.

bottom of page