top of page
MediaFx

లైట్ బీర్లు దొరకట్లే.. ఇతగాడు చేసిన పనేంటో తెలిస్తే కంగుతింటారు


ప్రభుత్వానికి లేఖ రాశాడు ఓ మద్యం ప్రియుడు. ఈ మందుబాబు తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. రాష్ట్రంలో కొన్ని రకాల బీర్లకు కొరత ఏర్పడింది. ఈ కొరతను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ లేఖ రాశాడు. తాగుబోతుల సంఘం అధ్యక్షుడు రాసిన లేఖ ఇలా ఉంది. “నా పేరు కొట్రంగి తరుణ్, తాను తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడినని పేర్కొన్నాడు. గత 18 రోజులలో రాష్ట్రానికి రూ.670 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురావడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపాడు. కానీ కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు ఏ వైన్ షాప్‎లో గాని, బార్లలో గాని లభ్యం కావడం లేదని తెలిపాడు. ఎండ తీవ్రతలు ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రజలకు ముఖ్యంగా యువకులకు పెద్దలకు దాహం తీర్చుకునేందుకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని తమ దృష్టికి వచ్చిందని లేఖలో తెలిపాడు. ఈ జిల్లాలోనే కాదు కరీంనగర్, జగిత్యాల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో కూడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదు. ఈ లైట్ బీర్లను తాగడం ద్వారా మత్తు తక్కువ సమయం ఉంటుంది ఆ తర్వాత తమ పనులను చేసుకోగలుగుతాము అంటూ వివరించాడు. స్ట్రాంగ్ బీర్లు తాగడం ద్వారా కడుపులో మంట, తీవ్రమైన తలనొప్పి, వాంతులు వంటివి వస్తున్నాయని తెలిపాడు. తమకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి చల్లటి కింగ్ ఫిషర్ బీర్లను జిల్లాలోని అన్ని వైన్ షాపులలో, బార్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోమని కోరాడు. కింగ్ ఫిషర్ లైట్ బీర్లు తాగే ప్రతి ఒక్కరి తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నాడు. తమకు సహకరించినట్లయితే రాష్ట్ర ఆదాయాన్ని మరింత రెట్టింపు చేయుటకు తమవంతు కృషి చేస్తామని తెలిపాడు.

ఈ సందర్భంగా కొన్ని వైన్ షాపులు అన్ని సిండికేట్ అయి కింగ్ ఫిషర్ లైట్ బిర్లలో మార్జిన్ తక్కువ వస్తుందని వాటిని తెప్పించడం లేదంటున్నట్లు కూడా పేర్కొన్నాడు. కొత్త రకం బీర్లను తాగడం ద్వారా తమ ఆరోగ్యాలు పాడయ్యే అవకాశం ఉందని సూచించాడు. రాష్ట్ర ఆదాయం కోసం తమ ఆరోగ్యాలు సైతం లెక్కచేయడం లేదని అందుకే దయచేసి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని తాము కోరిన విధంగా మంచి మద్యాన్ని అందుబాటులో ఉంచమని కోరుతూ లేఖ రాశాడు. ఈ లెటర్ ఇప్పుడు వైరల్ గా మారింది.


bottom of page