మనసులోని భావాలను వ్యక్తపరచడానికి అక్షరాలు సరిపోవు. అందుకే నిన్నటి తరం కవితలను అల్లుకున్నది. కావ్యాలను నమ్ముకున్నది. 5జీకి హాయ్ చెబుతున్న ఈ తరం అక్షరాలను అరకొరగా వాడుతున్నది. వాట్సాప్ మెసేజింగ్‌లో ఎమోజీలు, జిఫ్‌లు, యానిమేటింగ్ స్టిక్కర్స్ సంధిస్తూ.. ఔరా! అనిపించుకుంటున్నది. ఇప్పుడు వీటికి తోడు ‘ఏఐ’ వచ్చింది. దీంతో సందేశాల్లో స్టిక్కర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక వాట్సాప్‌లో కొత్తగా ‘ఇమేజిన్’ ఆప్షన్ వచ్చి చేరింది.
ఇది ‘మెటా ఏఐ’తో అనుసంధానమై పనిచేస్తుంది. మీరు ప్రత్యేకంగా ఏదైనా స్టిక్కర్ పంపాలనుకుంటే కమాండ్స్ ఇస్తూ రూపొందించొచ్చు. ఉదాహరణకు మీ స్నేహితుడికి ‘గుడ్ నైట్’ చెబుతూ ఓ స్టిక్కర్‌ని పంపాలనుకుంటే.. ‘నైట్ విత్ ఏ ఫుల్ మూన్ అండ్ స్టార్స్’ అని కమాండ్ ఇస్తే చాలు… మెటా ఏఐ అదిరిపోయే ఇమేజ్‌లను క్రియేట్ చేస్తుంది.
దాన్ని యానిమేట్ కూడా చేయొచ్చు. ఇలా మీ ప్రియమైన వారికి మనసైన స్టిక్కర్లు పంపొచ్చు. ‘ఇమేజిన్’ ఆప్షన్ కోసం.. వాట్సాప్ మెసేజింగ్ బార్‌లో అటాచ్‌మెంట్స్ ఐకాన్‌ను ట్యాప్ చేయాలి. మెనూలో చివరిగా ఇమేజిన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని.. కమాండ్స్ ఇస్తే సరి! ఇంకెందుకు ఆలస్యం మీ ఊసులకు ఊహల రెక్కలు తొడిగేయండి.