భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్ 2023 లీగ్ రౌండ్ నవంబర్ 12న ముగియనుంది. దీని తర్వాత నవంబర్ 15న తొలి సెమీఫైనల్ మ్యాచ్, నవంబర్ 16న రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఈ రెండు మ్యాచ్‌లు ముంబై, కోల్‌కతాలో జరగనుండగా, నవంబర్ 19న అహ్మదాబాద్ మైదానంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నాకౌట్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లకు సంబంధించి అభిమానులకు పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల కోసం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ గురువారం (నవంబర్ 9) రాత్రి 8 గంటలకు నుంచి ప్రారంభమవుతుంది. బుక్ మై షో అధికారిక వెబ్‌సైట్ అండ్ యాప్ ద్వారా అభిమానులు ఈ నాకౌట్ మ్యాచ్‌ల టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. అలాగే బీసీసీఐ అధికారిక వెబ్ సైట్‌లోనూ నాకౌట్ మ్యాచ్‌ల టికెట్‌లను పొందవచ్చు. కాగా ఈ ప్రపంచ కప్‌లో భారత జట్టు మ్యాచ్‌ల టికెట్లు నిమిషాల వ్యవధిలో బుక్ అయిపోయాయి. ఇప్పుడు భారత్ కూడా సెమీస్ చేరడంతో నాకౌట్ మ్యాచ్‌ల టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడు పోయే అవకాశముంది.
భారత్‌కి ప్రత్యర్థి ఎవరు? 2023 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన టీమ్‌ఇండియా అన్నింటిలోనూ విజయం సాధించి సెమీస్‌లో స్థానం ఖాయం చేసుకుంది. అదే సమయంలో లీగ్ మ్యాచ్‌లు ముగిశాక పాయింట్ల పట్టికలో టీమిండియా తొలి స్థానంలో నిలవడం ఖాయం. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 🏏