top of page
MediaFx

ఊసరవెల్లులు రాజ్యం నడిపితే తొండలు, ఉడతలే వస్తాయి.. కాంగ్రెస్‌ పాలనపై కేటీఆర్‌ సెటైర్లు..


ఏదైనా చెడు జరిగితే కేసీఆర్‌ మీదకు నూకాలి.. మంచి జరిగితే మన ఖాతాలో వేసుకోవాలి అన్నట్లుగా కాంగ్రెస్‌ నాయకుల తీరు ఉందని కేటీఆర్‌ విమర్శించారు. 30వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నాడని అన్నారు. ఉద్యోగం ఇవ్వాలంటే నోటిఫికేషన్‌ ఇవ్వాలి.. పరీక్ష పెట్టాలి.. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించాలి.. ఈ మూడు అయిన తర్వాతనే ఉద్యోగం ఇస్తారని అన్నారు. కానీ రేవంత్‌ రెడ్డి పరిపాలనలో ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలే.. ఒక్క పరీక్ష పెట్టలే.. ఒక్క ఇంటర్వ్యూ చేయలే.. కానీ 30వేల ఉద్యోగాలు ఇచ్చినా అని ఊదరగొడుతున్నారని విమర్శించారు. లగ్గం కాలే.. సంసారం చేయలే.. కానీ పిల్లలు పుట్టిండ్రు అని అంటున్నాడని.. దీన్ని ఎట్ల నమ్మాలని ప్రశ్నించారు. ఈ మాట అడిగితే.. పరీక్షలు మీరే పెట్టొచ్చు.. కానీ చిక్కుముళ్లు విప్పి ఉద్యోగాలిస్తే తప్పంటారా? అని ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఎంత ఇజ్జత్‌ తక్కువ మనుషులు అని విమర్శించారు.

ఈయన చెబితే నమ్మట్లేదని.. రాహుల్‌ గాంధీని అశోక్‌నగర్‌ తీసుకెళ్లి చెప్పిచ్చిండ్రు అని కేటీఆర్‌ అన్నారు. అధికారంలోకి వచ్చినంక మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని అన్నారు. కనీసం రెండు ఉద్యోగాలు అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇద్దరు నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాలు సంపాదించిండ్రు అని విమర్శించారు. రాహుల్‌గాంధీకి ఉద్యోగం లేకుండే.. ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయ్యారని అన్నారు. రేవంత్‌ రెడ్డికి ఉద్యోగం లేకుండే.. ఆయన ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని నమ్మబలికాడని అన్నారు. ఏమైంది మరి ఉద్యోగాలు వచ్చాయా అని ప్రశ్నించారు. వీళ్ల మోసాలను తెలంగాణ యువత ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెసోళ్లు ఇంత మోసగాళ్లా? ఇంత అన్యాయం చేస్తారా అని తెలంగాణ యువత మర్లబడుతుందని చెప్పారు. మొన్న అసెంబ్లీకి వచ్చిండ్రు అని.. అశోక్‌నగర్‌లో లొల్లి అయ్యిందని.. దిల్‌సుఖ్‌నగర్‌లో లొల్లి అయ్యిందని.. రాష్ట్రమంతా లొల్లిలు అవుతున్నాయని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాల ముచ్చట బోగస్‌ అని తెలంగాణ యువతకు అర్థమైతుందని అన్నారు.

మిగిలింది మూడు నెలలే అని.. మూడు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇవ్వాలే అని.. తెలంగాణ అసెంబ్లీలో కొత్త దందా మొదలు పెట్టారని విమర్శించారు. అందుకే జాబ్‌ క్యాలెండర్‌ అని ఒకటి ఇచ్చారని అన్నారు. మైసూర్‌ బజ్జీలో మైసూర్‌ ఉండటం ఎంత వాస్తవమో.. నేతిబీరకాయలో నెయ్యి ఉండటం ఎంత వాస్తవమో.. జాబ్‌ క్యాలెండర్‌లో జాబులు అంతే వాస్తవమని ఎద్దేవా చేశారు. అది జాబ్‌ క్యాలెండర్‌ కాదు.. జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ అని విమర్శించారు.




bottom of page