కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో జరిగిన ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరుగుతోంది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. ఆ బెంచ్‌లో జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలు ఉన్నారు. కోల్‌కతా ఘటన.. దేశవ్యాప్తంగా డాక్టర్ల భద్రత అంశం గురించి ఆందోళన కలిగిస్తోందని సీజేఐ అన్నారు. డాక్టర్ల గురించి ఆందోళన చెందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అత్యాచార బాధితురాలి పేరు, ఫోటో, వీడియో క్లిప్ ఎలా బయటకు లీకైందని, బాధితురాలి పేరును వెల్లడించడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని, ప్రాణాలు కోల్పోయిన ఓ యువ డాక్టర్ గౌరవాన్ని ఇలాగేనా కాపాడేది అంటూ సుప్రీం ధర్మాసనం తెలిపింది. ట్రైనీ లేడీ డాక్టర్ ఘటనను సూసైడ్‌గా చిత్రీకరించిన ప్రిన్సిపల్ వైఖరిని సుప్రీం తప్పుపట్టింది. ఎందుకు ఆమె పేరెంట్స్‌కు బాడీని చూసే అవకాశాన్ని ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ గురించి కూడా సుప్రీం ప్రశ్నించింది. క్రైం ఉదయం పూట జరిగితే, ఎందుకు అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కోర్టు అడిగింది. రాత్రి 11.45 నిమిషాల వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ రాయలేదని సీజేఐ ప్రశ్నించారు. అయితే అసహజ మరణం కింద కేసును రిజిస్టర్ చేసినట్లు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ తెలిపారు. అర్థరాత్రి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటే, అది మర్డరే అన్న సంకేతాన్ని ఇస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక హాస్పిటల్‌లో తీవ్రమైన నేరం జరిగిందని, అసలు ఎలా విధ్వంసకారుల్ని ఆస్పత్రిలోకి రానిస్తున్నారని సుప్రీం బెంచ్ ప్రశ్నించింది.
కోల్‌కతా డాక్టర్ రేప్ ఘటనపై స్టేటస్ రిపోర్టును సీబీఐ ఇవ్వాలని సుప్రీం కోరింది. ఈ కేసులో విచారణ ఏ స్థాయిలో జరుగుతోందని చెప్పాలని వెల్లడించింది. జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని, సీనియర్, జూనియర్ డాక్టర్ల రక్షణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి సూచనలు చేయాలని సీజేఐ తన తీర్పులో వెల్లడించారు.