top of page
MediaFx

గ్రౌండ్‌లో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ..


ఆదివారం ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది.223 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 221 పరుగులకు ఆలౌటైంది. విల్ జాక్స్‌ ( 32 బంతుల్లో 55, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రజత్ పాటిదార్‌ ( 23 బంతుల్లో 52, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించినా ప్రయోజనం లేకపోయింది. ఓపెనర్లు విరాట్‌ కోహ్లీ (18), డుప్లెసిస్‌ (7) , ప్రభుదేశాయ్‌ (24), గ్రీన్‌ (6) మహిపాల్‌ (4) తీవ్రంగా నిరాశ పర్చడంతో ఆర్సీబీకి పరాజయం తప్పలేదు. అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్ ప్రారంభంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. వివరాల్లోకి వెళితే.. భారీ లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. కోహ్లీ, డుప్లెసిస్ దూకుడు మీద ఉన్నారు. అయితే హర్షిత్ రాణా మూడో ఓవర్ తొలి బంతికే విరాట్ కోహ్లి పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఇక్కడే వివాదం మొదలైంది. హర్షిత్ రాణా బంతి హై ఫుట్ టాస్‍గా రాగా.. అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు విరాట్. అయితే థర్డ్ అంపైర్ ఆ హైఫుల్ టాస్ బంతిని నోబాల్‍గా ప్రకటించలేదు. కోహ్లీ నడుము కంటే కిందే ఆ ఫుల్‍టాస్ ఉందని భావించి ఔట్‍గా ప్రకటించాడు. దీంతో కోహ్లీ ఫీల్డ్ అంపైర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది నో బాల్ కాదా.. అంటూ గ్రౌండ్ లోనే వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కోపంగా పెవిలియన్‍పైపుగా నడుచుకుంటూ వెళ్లాడు. కోహ్లీ క్రీజు బయట ఉండటంతో థర్డ్ అంపైర్ దాన్ని నోబాల్ ఇవ్వలేదు. దీంతో విరాట్ డగౌట్ లో ఆగకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లాడు.అక్కడ ప్రవేశ ద్వారం వద్ద బ్యాట్ నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.



Comentários


bottom of page