top of page
Suresh D

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?


ప్రజలు ఆత్మ శుద్ధి కోసం దేవాలయాలను సందర్శించే అలవాటును పెంచుకున్నారు. దేవుని పట్ల ఎవరి ఆదర్శాలు, నమ్మకాలను వారు బలంగా విశ్వసిస్తారు. మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు, ఆలయం అనేది సామాజిక, మానవతావాదాన్ని ఆకర్షించే ఒక పవిత్ర స్థలం. ఆలయ సందర్శన మనిషికి మానసిక ప్రశాంతత, సంతృప్తిని ఇస్తుంది. ఇది మన జీవితంలో సానుకూల ఫలితాలను కలుగజేస్తుంది. దీనితో పాటు మనం ఆలయాన్ని ఎప్పుడు సందర్శించాలో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా మనం ఉదయం, సాయంత్రం వేళల్లో ఆలయాన్ని సందర్శించడం చూస్తుంటాం. అయితే మధ్యాహ్న సమయంలో కూడా ఆలయాన్ని సందర్శించే వారిని చూశారా..? మధ్యాహ్న సమయంలో గుడికి వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువ. పైగా ఆ సమయంలో చాలా వరకు ఆలయాలను మూసివేస్తుంటారు. మధ్యాహ్న వేళల్లో దేవాలయాలకు ఎందుకు వెళ్లకూడదో తెలుసా?

1. దేవాలయాలలో తలుపులు మూసే సమయం :

అనేక దేవాలయాల తలుపులు మధ్యాహ్న సమయంలో మూసివేస్తారు. ఆలయాన్ని శుభ్రం చేయడానికి, సాయంత్రం పూజకు సిద్ధం చేయడానికి ఆలయ తలుపులు మధ్యాహ్న సమయంలో మూసివేస్తారు. అలాగే, మధ్యాహ్న సమయంలో స్వామివారు గుడిలో సేదతీరుతారని చెబుతారు. ఇలాంటి సమయంలో మీరు గుడికి వెళితే దేవుని నిద్రకు ఆటంకం కలుగుతుందని నమ్ముతారు.

2. అధిక ఎండవేడిమి :

మధ్యాహ్న సమయంలో సూర్య కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో దేవాలయాలను సందర్శించడం, ప్రత్యేకించి బహిరంగ ప్రదేశాల్లో ఉండటం వలన మీరు చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. దాంతో మన శరీరం సోమరిగా ఉంటుంది. మన మెదడు నిద్రమత్తులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో.. మధ్యాహ్నం సోమరితనం నిండిన మనస్సుతో దేవుడిని చూడకూడదంటారు జ్యోతిష్యులు.

3. భక్తుల సంఖ్య తక్కువ :

మధ్యాహ్నం సమయంలో చాలా మంది ప్రజలు పని లేదా ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో ఆలయాల్లో భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇలాంటి అన్ని కారణాలు మినహా, మధ్యాహ్నం సమయంలో ఆలయాన్ని సందర్శించకపోవడం వెనుక మతపరమైన లేదా శాస్త్రీయ ఆధారం లేవని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం గుడికి వెళ్లాలనిపిస్తే వెళ్లవచ్చు. దేవాలయాన్ని సందర్శించడం ఉద్దేశ్యం దేవుని పట్ల భక్తి, గౌరవాన్ని వ్యక్తపరచడం అని గమనించడం ముఖ్యం. మీరు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఏ సమయంలోనైనా ఆలయాన్ని సందర్శించవచ్చు.

bottom of page