top of page

సాయిచంద్ భార్యకు తీవ్ర అనారోగ్యం.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

బీఆర్ఎస్ నేత, గాయకుడు సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మరణించగా.. ఇప్పుడు ఆయన భార్య రజని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రజనికి గుండెనొప్పి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ భార్య రజని తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యారు. సోమవారం సాయంత్రం ఆమెకు ఒక్కసారిగా గుండెనొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబసభ్యులు రజనీని వెంటనే గుర్రంగూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్ల సమాచారం.

భర్తను కోల్పోయిన బాధలో రజని గుండె పగిలేలా రోదిస్తున్నారు. కొద్ది రోజులుగా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ క్రమంలో గుండెనొప్పి రావడంతో తొలుత బీఎన్‌రెడ్డి నగర్‌లోని కోణార్క్ డయాగ్నస్టిస్ సెంటర్‌కు ఆమెను కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అక్కడ టెస్టులు చేసిన వైద్యులు.. ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం రజనీని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. భర్తను కోల్పోయిన దుఖంలో ఆహారం, నీళ్లు తీసుకోకపోవడం వల్ల నీరసించిపోవడం, తీవ్ర ఒత్తిడి వల్ల గుండెనొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె అస్వస్థతకు సంబంధించి కుటుంబసభ్యులెవరూ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

రజని అస్వస్థతకు గురైందనే వార్తలతో సాయిచంద్ అభిమానులు ఆందోళనకు గురువుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. రజని త్వరగా కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా రజని ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు.అయితే తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజల్లో ఉద్యమ ఆకాంక్షను రగిల్చిన సాయిచంద్.. గత నెల 29న గుండెపోటుతో మరణించారు. ఆ రోజు రాత్రి హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉన్న సమయంలో సాయిచంద్‌ హార్ట్‌స్ట్రోక్‌కు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు గమనించి హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సాయిచంద్ మృతిపై బీఆర్ఎస్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఇంటికెళ్లి సాయిచంద్ మృతదేహానికి నివాళులర్పించారు. సాయిచంద్ తల్లిదండ్రులు, భార్యను కేసీఆర్ ఓదార్చారు.

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page