టమాట రేట్లు మార్కెట్లో విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో ప్రస్తుతం సామాన్య మానవులు టమాట కొనలేని పరిస్థితి నెలకొంది. అయితే టమాట లేని కూర తెలుగింట్లో ఉండదు. ప్రతి రోజూ ఏదో ఒక విషయంలో టమాట ఉండాల్సిందే.
అంతలా టమాట ప్రతి కూరలో వేసుకునే అలవాటు తయారైంది. అయితే టమాట రేటు కేజీ రూ. 150 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. దీని వల్ల సామాన్య ప్రజలు టమాటను కొనడానికి భయపడుతున్నారు. టమాట రేటు బహిరంగ మార్కెట్ లో రూ.100 కు పైగానే ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లలో దాదాపు 30, 40 రూపాయలు తగ్గించి ఇస్తోంది. కానీ ప్రతి ఒక్కరూ రైతు బజార్లకు వెళ్లే పరిస్థితి ఉండదు. కాబట్టి బహిరంగ మార్కెట్లో టమాట రేట్ విపరీతంగా పెరిగి పోతూనే ఉంది. దీన్ని బ్లాక్ మార్కెట్ లో దాచి పెట్టడం ద్వారా టమాట రేట్ అమాంతం పైకి పెరిగిపోయిందని అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థ ఉంది. రేషన్ దుకాణాలు ఉన్నాయి. రేషన్ చేర వేసే సరకు వాహనాలు ఉన్నాయి. వీటిని జగన్ సర్కారు ఉపయోగించుకుని టమాటలను ఇంటింటికీ సప్లై చేయడం వల్ల ఆదాయం పెరుగుతుంది. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు సామాన్యుడికి అందించవచ్చు. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కొన్ని స్తబ్దుగా ఉన్న వాటిని సరిగా ఉపయోగించుకుంటే వాటి నుంచి ఫలితం పొందవచ్చు.
ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇదే పని కొనసాగిస్తున్నారు. టమాటలను ఇంటింటికీ తక్కువ ధరకు చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. రేషన్ షాపుల్లో టమాటలను పెట్టిస్తున్నారు. అది కేవలం రూ. 60 రూపాయలకే అందిస్తున్నారు. రేషన్ దుకాణాలకు పేద వర్గాల వారు వస్తారు. వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ పట్టణాల్లో రైతు బజార్లకు వెళ్లాలంటే మాత్రం అది సాధ్యం కానీ పని. కాబట్టి స్టాలిన్ చేసిన ఆలోచన జగన్ చేస్తే బాగుంటుందని చాలా మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ రాయితీ పై అయినా టమాటా ఇస్తున్నారు. కేసీఆర్ సర్కారు కనీసం ఆ ఆలోచన కూడా చేయడం లేదు.