top of page
MediaFx

కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం


జిల్లాలోని వేములపల్లి వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఒకదానికొకటి ఢీకొనడంతో కాన్వాయ్‌లోని ఎనిమిది వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే, బీఆర్ఎస్ నేతలకు ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముందు వెళ్తున్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బస్సు యాత్ర, రోడ్ షోల ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ఉధృతం చేశారు. బుధవారం మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన కేసీఆర్ యాత్ర మే పదో తేదీన సిద్దిపేటతో ముగియనుంది. ఈ యాత్ర ద్వారా ఉదయం పూట 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు తెలుసుకోనున్నారు.

ఈ సందర్భంగా తొలి రోజు కేసీఆర్ మిర్యాలగూడ, సూర్యాపేటలో రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడ సమీపంలోని వేములపల్లిలో కేసీఆర్‌ వెళ్తున్న కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది.కాగా, బస్‌యాత్రలో భాగంగా మిర్యాలగూడకు వెళ్తున్న సమయంలో నల్గొండ మండలం ఆర్జాలబాయి వద్ద ఐకేపీ సెంటర్‌ను కేసీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు గన్నీ బ్యాగులతో ప్రదర్శన చేపట్టారు. కేసీఆర్‌తో రైతులు మాట్లాడుతూ.. ఇరువై రోజులనుంచి కల్లాల్లో ఓడ్లుపోసుకొని కూసున్నామని ధాన్యం కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ స్పందిస్తూ.. మళ్లీ పోరాడి నీళ్లు కరెంటు మళ్లీ తెచ్చుకుందామన్నారు. పోరాటానికి సిద్ధంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అంతకుముందు అన్నెపర్తి వద్ద కేసీఆర్‌ వాహనాన్ని రైతులు ఆపి తమ కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

bottom of page