కేరళలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ (Justice Hema Committee report) మాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పలువురు సినీతారలు చిత్ర పరిశ్రమలో తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలను బయటపెడుతున్నారు.
ఈ నేపథ్యంలో జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటు అంశంపై కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏరాష్ట్ర ప్రభుత్వమూ సినీ పరిశ్రమలో జోక్యం చేసుకొని జస్టిస్ హేమ కమిటీ తరహా కమిటీలను ఏర్పాటు చేయలేదని.. కేరళలో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్నందునే ఇది సాధ్యమైందన్నారు. ఇప్పటికే ఈ కమిటీ ముందు వాంగ్మూలాలు ఇచ్చినవారు, ఇవ్వని వారు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని, వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో మహిళా వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని ఈ సందర్భంగా తెలిపారు. మంగళవారం తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం.. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మహిళలపై దాడులు కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.