top of page
MediaFx

జంక్ ఫుడ్ తినే అలవాటుందా..? ప్రాణాలు తొందరగానే పోతాయంట జాగ్రత్త..🍔


జంక్ ఫుడ్ ఆరోగ్యానికి చాలా హానికరం.. ఈ విషయాన్ని తరచూ వైద్య నిపుణులు చెబుతుంటారు. వాస్తవానికి జంక్ ఫుడ్ చాలా ప్రమాదకరమన్న విషయాన్ని ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం మరింత బలపరిచింది. అమెరికాలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ప్రజల జీవితకాలం తగ్గిపోతుంది. ఇది అకాల మరణాల ప్రమాదాన్ని పెంచుతుందని కనుగొంది. ఈ అధ్యయనం బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ)లో ప్రచురించారు. ఇందులో దాదాపు 44 వేల మంది పెద్దల ఆహారం, ఆరోగ్య సమాచారాన్ని 34 ఏళ్లుగా పరిశోధకులు అధ్యయనం చేశారు. అధ్యయనం సమయంలో, వారు తినే ఆహారం గురించి వివరణాత్మక సమాచారం తీసుకున్నారు. పెద్ద మొత్తంలో అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే వ్యక్తులు ముందస్తు మరణానికి ఎక్కువ అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే వాటి సహజ స్థితి నుండి చాలా వరకు మార్చినవి అని అధ్యయనంలో వివరించారు. ఈ ఆహారాలలో సాధారణంగా అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు, కొవ్వు, కృత్రిమ మూలకాలు ఉంటాయి. ఉదాహరణకు, ప్యాక్ చేసిన స్నాక్స్, క్యాన్డ్ ఫుడ్, నూడుల్స్, ఇన్‌స్టంట్ సూప్, శీతల పానీయాలు మొదలైనవి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ విభాగంలోకి వస్తాయి.

అధ్యయనం – పరిమితులు..

ఇది పరిశీలనాత్మక అధ్యయనం అని పరిశోధకులు అంటున్నారు.. కావున అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ నేరుగా ముందస్తు మరణానికి కారణమవుతుందని నిరూపించలేదు. అయితే, ఈ ఆహారాలను తీసుకోకపోవడం, లేదా తగ్గించడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధ్యయన ఫలితాలు గట్టిగా సూచిస్తున్నాయి. 

తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు.. తాజా ఆహారాన్ని మన ఆహారంలో చేర్చుకోవాలని ఈ అధ్యయనం పునరుద్ఘాటిస్తున్నట్లు పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించి.. ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య ఆహారాన్ని అనుసరించాలని కోరుతున్నారు.

bottom of page