విజయవాడలో వరదల ముంపునకు కూటమి ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్ రెండుసార్లు బయటకొచ్చి తమ ప్రభుత్వంపై బురద జల్లి వెళ్లారని విమర్శించారు. ప్రకాశం బ్యారేజీకి పూర్తిస్థాయిలో వరద చుట్టు ముడుతుంటే, దానిని కూడా డిస్ట్రబ్ చేయడానికి, విధ్వంసం చేయడానికి జగన్, వైసీపీ నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు. విశాఖపట్నంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. ఏపీలో విధ్వంసం సృష్టించడానికి బోట్లను, వదిలిపెట్టారని ఇరిగేషన్ అధికారులే చెబుతున్నారని తెలిపారు. పిల్లర్లను ఢీకొట్టి ప్రమాదం జరిగితే, కొన్ని వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్దండరాయపురంలోఉన్న బోట్లు ప్రకాశం బ్యారేజికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బోట్లు పోయాయని ఈరోజు వరకు ఎవరూ ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. వైసీపీ నేతలు నందిగామ సురేశ్, తలశిల రఘురాం అనుచరులకు చెందిన బోట్లతోనే ఈ కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. క్రిమినల్ మైండ్ ఉన్న నాయకుడు ప్రజల కోసం ఆలోచించరనడానికి ఇదే ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. జగన్ రెడ్డి ఎన్ని వేషాలు వేసినా అవి వర్కవుట్ కాలేదని విమర్శించారు. విపత్కర సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చినప్పటికీ జగన్‌కు ఇంకా బుద్ధి రావడం లేదని వంగలపూడి అనిత విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డిపై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. సమాజంలో తిరిగే అర్హత ఆయనకు లేదని విమర్శించారు.