రెండు రోజులు వేచి చూసినా కూడా ఏ ఒక్కరి అపాయింట్‌మెంట్ దొరక్క పోవడంతో జగన్ నిరాశతో వెనుదిరిగారు. వాస్తవానికి ఐదేళ్ల పాటు ఏపీలో జగన్ అరాచక పాలన కొనసాగించారు. ఇప్పుడు కనీసం ఆరు వారాలు తిరగకముందే ‘ఏపీలో హింసాకాండ’ అంటూ ఢిల్లీ వీధుల్లో ధర్నాకు దిగారు. ఆరు వారాలకే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలట. నవ్విపోదురుగాక.. పైగా తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదని.. ఇప్పుడు దాడులు, దౌర్జన్యాలతో ఏపీలో భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఏపీలో లోకేశ్ రెడ్ బుక్ పాలన కొనసాగుతోందంటూ ఢిల్లీలో జగన్ నానా రచ్చ చేశారు. బీభత్సమైన జన సందోహం నడుమ ధర్నా చేయాలని వెళ్లారు. తీరా అక్కడి సీన్ చూస్తే తిప్పి కొడితే 200 మంది కూడా లేరు. ఇక ఆ 200 మందిలోనూ.. సగం మంది పోలీసులు, మీడియా ప్రతినిధులే కావడం గమనార్హం.
అది చూసిన జగన్‌కు చిర్రెత్తుకొచ్చింది. నిర్వాహకులపై మండి పడ్డారు. పైగా అక్కడి సీన్ చూసి వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులే అవాక్కయ్యారట. ఇక అంతటితో జగన్‌కు తలనొప్పి తగ్గిందా? అంటే ఆ తర్వాత కూడా కొనసాగింది. ఆయన మీడియాతో మాట్లాడుతుండగా... మైకు సరిగా పనిచేయలేదు. దీంతో ఆయనకు కోపం బీభత్సంగా వచ్చి ఉంటుంది. ఇక ఆ తర్వాత... మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహరించిన తీరు సైతం పార్టీ నేతలకు మింగుడు పడలేదు. ‘ఎవరూ స్టేజీ మీదికి రావొద్దు’ అని అంబటి చెప్పడంతో కీలక నాయకులూ కొంత అసహనంతో దూరంగా వెళ్లిపోయారు. ఇక జగన్ కలుగజేసుకుని పరిస్థితిని సరి చేశారు. వేదికపై వసతులు, ఏర్పాట్ల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమమంతా సమన్వయం లేకుండా సాగిందంటూ పార్టీ నేతలు సైతం పెదవి విరిచిన పరిస్థితి.