ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ గ్రూపు మధ్య గత పది నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. గాజా స్ట్రిప్‌పై (Gaza) ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఆసుపత్రులు, పాఠశాలలపై వైమానిక దాడులు కొనసాగిస్తోంది. తాజాగా తూర్పు గాజాలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ సేనలు భీకర దాడులు జరిపారు. ఈ ఘటనలో ఏకంగా 100 మందికి పైగా మృతి చెందారు. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. ఈ మేరకు పాలస్తీనా అధికార వార్తా సంస్థ ‘వాఫా’ పేర్కొంది. స్కూళ్లపై వరుస దాడులు..
గత వారంలో ఏకంగా నాలుగు పాఠశాలలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఆగస్టు 4న గాజా నగరంలో నిరాశ్రయ ప్రజలకు ఆశ్రయం పొందుతున్న రెండు పాఠశాలపై జరిగిన దాడిలో 30 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. అంతకుముందు రోజే నగరంలోని హమామా అనే పాఠశాలపై దాడి జరపగా ఈ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆగస్టు 1న దలాల్ అల్-ముఘ్రాబీ స్కూల్‌పై జరిగిన దాడిలో 15 మంది మరణించారు. ఈ నాలుగు ఘటనల్లో మొత్తం 62 మంది ప్రాణాలు కోల్పోయారు.
గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. హమాస్ మిలిటెంట్లు నరమేధం సృష్టించి వందలాది మందిని పొట్టనపెట్టుకున్నారు. అందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేస్తున్నాయి. సైనిక దాడిని ప్రారంభించినప్పటి నుంచి హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లుగా అనుమానిస్తున్న అన్ని భవనాలపై దాడులు చేస్తోంది.
గాజాను నలుదిక్కులా దిగ్బంధనం చేసి వైమానిక, రోడ్డు, జల మార్గాల ద్వారా భీకర దాడులు చేస్తోంది. ఉగ్రవాదులు ఉంటున్నారని అనుమానిస్తున్న స్కూల్స్, ఆసుపత్రుపై దాడులకు కూడా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇందులో భాగంగానే పలు పాఠశాలలు, హాస్పిటల్స్‌పై కూడా వరుస దాడులు చేస్తోంది. ఇక గత 10 నెలల సుదీర్ఘ యుద్ధంలో గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుమారు 40 వేల మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయి ఉంటారని అంచనా.