top of page
MediaFx

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వినాయకుడి విగ్రహాన్ని పెట్టడం శుభమా? అశుభమా?


జ్యోతిష శాస్త్రంలో వినాయకుడిని ప్రధాన దైవంగా భావిస్తారు. కుటుంబంపై గణేశుడు ఆశీర్వాదం పొందటం కోసం ప్రజలు తరచుగా వారి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహాన్ని ఉంచుతారు. గణపతికి రోజూ పూజలు చేస్తారు. ఇంటి ఆనందం, శ్రేయస్సు పూజ గదితో పాటు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కూడా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇలా ఉంచడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ ప్రసరించేందుకు ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యం. వినాయకుడి విగ్రహం పెట్టుకుంటే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించలేదు. పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది.పనిలో ఆటంకాలు తొలగిపోవాలని, తమ బాధలు తీరిపోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు వినాయకుడిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల విఘ్నేశ్వరుడు సంతోషించి తన భక్తులకు సుఖసంతోషాలు ప్రసాదిస్తాడని విశ్వసిస్తారు. అయితే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు వాస్తుకు సంబంధించి కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అనుసరించాలని వాస్తు నియమాలు ఏంటో తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు దిశ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రధాన ద్వారం ఉత్తరం లేదా దక్షిణ దిశలో ఉంటే వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభదాయకం. అయితే ప్రధాన ద్వారం తూర్పు లేదా పడమర దిశలో ఉంటే ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ఉంచుకోకూడదు.

వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు వినాయకుడి ముఖం స్పష్టంగా ఉండే విధంగా చేసుకోవాలి. కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వినాయకుడు విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా సానుకూల శక్తి ప్రసరణ అవుతుంది. జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం.

వాస్తు ప్రకారం ఆనందం, శ్రేయస్సు కోసం ప్రధాన ద్వారం వద్ద కుంకుమ రంగు వినాయకుడి విగ్రహాన్ని ఉంచడం శుభదాయకం. వీటితోపాటు చేతిలో లడ్డూలు, మోదకాలు, గణేషుడికి ఇష్టమైన వాహనం ఎలుక కూడా ఉండే విధంగా చూసుకోవాలి. ప్రగతి కోసం తెలుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటే మంచిది.

ప్రధాన ద్వారం వద్ద గణపతి బప్పా విగ్రహంలో ఆయన తొండం ఎడమవైపుకు ఉండాలి. ఒకవేళ ఇంట్లో పెట్టుకుంటున్నట్లయితే కుడివైపున తొండం ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. పిల్లలు కావాలని కోరుకునే వాళ్ళు, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు కుడివైపు తొండం తిరిగి ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది.

నృత్య భంగిమలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. అలాగే ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు. ఇటువంటి ప్రతిమ ఇంట్లో ఉంచుకుంటే కలహాలు, గొడవలు జరుగుతాయి.

వాస్తు ప్రకారం విఘ్నేశ్వరుడు విగ్రహాన్ని ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. బాత్రూమ్ డోర్ దగ్గర అసలు ఉంచుకోకూడదు. అలాగే పడకగదిలో గణేషుడు విగ్రహాన్ని పెట్టుకుంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలుగుతాయి. అందుకే ఈ ప్రదేశంలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టకూడదు.

bottom of page