top of page
MediaFx

హిట్‌మ్యాన్‌ ముంబైని వీడటం ఖాయమేనా?


ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో 14 ఏండ్లుగా సాగుతున్న ప్రయాణానికి ఆ జట్టు మాజీ సారథి రోహిత్‌ శర్మ ముగింపు పలుకుతాడా? మరికొద్దిరోజుల్లో జరుగబోయే ఐపీఎల్‌ 2025 వేలంలోకి రోహిత్‌ వస్తాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హిట్‌మ్యాన్‌ వేలంలోకి వస్తే ఎవరూ ఊహించని ధరకు కొనడానికి సిద్ధంగా ఉన్నట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ వంటి జట్లు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ముంబైని వీడేందుకు రోహిత్‌ మొగ్గుచూపుతున్నాడంటూ గతంలో పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రస్తుతం వ్యాఖ్యాతగా పనిచేస్తున్న ఆకాశ్‌ చోప్రా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. తన యూట్యూబ్‌ చానెల్‌లో ఆకాశ్‌ మాట్లాడుతూ… ‘అతడు (రోహిత్‌) ముంబైతో ఉంటాడా? ఉండడా? అనేది ప్రస్తుతం అతిపెద్ద ప్రశ్న. వ్యక్తిగతంగా నా అభిప్రాయం మేరకైతే రోహిత్‌ కచ్చితంగా ముంబైతో ఉండడనే అనిపిస్తోంది. ఒకవేళ ఇప్పుడు ముంబై గనక అతడిని రిటైన్‌ చేసుకుంటే మరో మూడేండ్ల పాటు అతడు ఆ జట్టుతోనే ఉండాలి. ఒక్క ధోనీ విషయంలో మాత్రం అలా జరిగేలా లేదు. ధోనీ, చెన్నై సూపర్‌ కింగ్స్‌ది డిఫరెంట్‌ ఎమోషన్‌. కానీ ముంబై మాత్రం రోహిత్‌ను వదులుకోవడానికే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అలా జరుగకున్నా ముంబై యాజమాన్యం అతడిని రిటైన్‌ చేసుకోకుండా ఉంటుందని నేను భావిస్తున్నా. ఈ రెండింటిలో ఏదైనా జరగొచ్చు..’ అని చెప్పాడు.

గతేడాది ముంబై యాజమాన్యం రోహిత్‌ను సారథిగా తప్పించి హార్దిక్‌ పాండ్యాను నియమించడంపై ఆ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన విషయం తెలిసిందే. హార్దిక్‌ను బహిరంగంగానే అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలు, సోషల్‌ మీడియాలో చేసిన రచ్చకు తోడు ఆ సీజన్‌లో ముంబై ప్రదర్శన కూడా నాసిరకంగానే ఉండటం ఆ జట్టు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో రోహిత్‌ స్వతహాగా ముంబైని వీడినా ఆ జట్టు అభిమానులు ఊరుకుంటారేమో గానీ అంబానీలు అతడిని రిటైన్‌ చేసుకోకుండా వేలానికి వదిలేస్తే అది మరెక్కడికి దారితీస్తుందోనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


bottom of page