top of page

అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.?


అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లే ‘గగన్‌యాన్‌’ మిషన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అక్కడికి వెళ్లవచ్చని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ పేర్కొన్నారు. మన ప్రభుత్వాధినేతను అంతరిక్షంలోకి పంపించగలిగే శక్తిసామర్థ్యాలు పొందగలిగితే మనందరికీ ఎంతో గర్వకారణమని అన్నారు. గగన్‌యాన్‌కు సంబంధించి ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. మిషన్‌కు సంబంధించి తాజా సమాచారాన్ని వెల్లడించారు.

ప్రధాని మోదీ అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఉందా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా డాక్టర్‌ సోమనాథ్‌ స్పందిస్తూ.. ‘‘వీఐపీలను పంపించడం ప్రస్తుత దశలో సాధ్యపడదు. ఎంతో నైపుణ్యం అవసరమైన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలంటే నెలలు, సంవత్సరాల తరబడి శిక్షణ పొందాల్సి ఉంటుంది. మోదీ వంటి ప్రముఖులకు మరెన్నో కీలక బాధ్యతలు ఉంటాయి. ఐఎస్‌ఎస్‌కు వెళ్లే వ్యోమగాములకు ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోంది’’ అని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ పేర్కొన్నారు. ఒక ప్రభుత్వాధినేత స్వదేశీ వాహనంలో అంతరిక్షంలోకి అడుగు పెట్టడమనేది మనందరికీ ఎంతో గర్వకారణమన్న ఆయన.. గగన్‌యాన్‌ ద్వారా అలా తీసుకెళ్లే సామర్థ్యాలను పొందగలమనే విశ్వాసం ఉందన్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page