🦠 కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. అయితే, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతోపాటు పలు దేశాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో ఆర్థిక పరిస్థితి అంతగా మెరుగుపడలేదు..
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో కూడా ఆర్థిక పరిస్థితులు మందగమనం నుంచి వృద్ధిలోకి వస్తున్న తరుణంలో ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థల రేటింగ్‌లలో ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ మార్పులు చేస్తూ కీలక ప్రకటన చేసింది. గతంతో పోల్చుకుంటే భారతదేశం కూడా అధిక వృద్ధివైపు పయనిస్తుందని అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది. భారత్ రేటింగ్‌ను మెరుగుపర్చి ‘ఓవర్‌వెయిట్’ గా అంచనావేసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, మూలధన వ్యయాలు, లాభాల విషయంలో భారత మార్కెట్ సానుకూల దృక్పథంలో పయనిస్తోందని మోర్గాన్ స్టాన్లీ వివరించింది. భారతదేశం స్థూల సూచికలు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయని.. ఆర్థిక వ్యవస్థ 6.2% GDP అంచనాను సాధించడానికి ట్రాక్‌లో ఉందని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.