🎓 ఉన్నత చదువులు అనగానే కాస్త ఆర్థిక స్తోమత కలిగిన వారికి ఎవరికైనా విదేశీ యూనివర్సిటీలే గుర్తుకొస్తాయి. విదేశాల్లో చదువుకోవడం స్టేటస్ సింబల్‌గా కూడా మారిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు పై చదువుల కోసం వెళ్తున్నారు. వాతావరణం, భౌగోళిక స్థితిగతులు, భాష, ఆహారం.. ఇవేవీ సరిపడకపోయినా సరే, విదేశీ విద్యపై ఇష్టంతో అన్ని కష్టాలను భరిస్తూ ముందుకు సాగుతున్నారు.
👨🏫 కొందరు విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగాలు సాధించి స్థిరపడుతుంటే.. కొందరు వెనక్కి తిరిగొచ్చి భారత్‌లో ఉన్నత స్థితిలో స్థిరపడుతున్నారు. అందరి కథలు ఇలా సుఖాంతమైతే ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. కానీ కొన్ని జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. ఎన్నో ఆశలతో తమ పిల్లలను విదేశాలకు పంపించిన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. చదువుకుని పేరు తెస్తాడని పంపిస్తే, విగతజీవిగా తిరిగొస్తున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. ఒక్కోసారి మృతదేహాన్ని వెనక్కి తీసుకురావడం కూడా కష్టతరంగా మారుతోంది.
🌐 ఇవన్నీ ఒకెత్తయితే, వెళ్లిన దేశంలో తలెత్తే ప్రకృతి వైపరీత్యాలు, లేదా యుద్ధాలు, అంతర్గత సంక్షోభాలు అక్కడ చదువుకోడానికి వెళ్లిన విద్యార్థుల పాటిన శాపాలుగా మారుతున్నాయి. వీటికి తోడు ఒత్తిడి, జాతి ద్వేషం, కాల్పులు, ప్రమాదాల వంటి ఘటనలతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఐదేళ్ల కాలంలో వివిధ దేశాల్లో వివిధ కారణాలతో ఇలా 403 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ శుక్రవారం (ఫిబ్రవరి 2) లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ మంద్రి డా. సుబ్రహ్మణ్యం జైశంకర్ సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. 🌐📚