top of page
MediaFx

ఇండియా కూటమి సంచలన నిర్ణయం

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని గద్దె దించాలనే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమి, బీజేపీకి మెజార్టీ స్థానాలు రాకుండా అడ్డుకుంది. అయితే బీజేపీని మేజిక్ ఫిగర్ దాటకుండా నిలువరించినా, అధికారం చేపట్టకుండా మాత్రం ఆపలేకపోయారు. ఎన్డీఏ మిత్రులతో కలిసి కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది.

ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి సమావేశమైన ఇండియా కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేకపోవడంతో, ఈసారి లోక్‌సభలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని బుధవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు.

ఢిల్లీలోని మల్లిఖార్జున ఖర్గే నివాసంలో భేటీ అయిన ఇండియా కూటమి నేతలు, సుదీర్ఘ చర్చలు జరిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ప్రతిపక్షంలో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇతర పార్టీలను కూడా ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్లు ఖర్గే తెలిపారు.

నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలన్నీ ఏకతాటిపై పోరాటం చేస్తాయని ఖర్గే ప్రకటించారు. బీజేపీ మేజిక్‌ ఫిగర్‌ను దాటకపోవడంతో నరేంద్ర మోదీ నైతికంగా ఓటమి చెందినట్లు ఖర్గే అన్నారు. ఈ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఉందని, నైతికంగా ఆయన ఓడిపోయారని విమర్శించారు. మోదీ వ్యక్తిగతంగా, రాజకీయంగానూ నష్టపోయారని పేర్కొన్నారు.

bottom of page