top of page

హైవేలపై వెళ్లే వాహనదారులకు అలర్ట్..


దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల్లో ఛార్జీల పెంపు అమల్లోకి వచ్చింది. ఏడాదికి ఒకసారి ఏప్రిల్‌ 1న టోల్‌ రుసుం పెరుగుతుంది. రోడ్ల నిర్వహణకు ఛార్జీల పెంపును ఆనవాయితీగా తీసుకున్న జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ).. ఈసారి కూడా కొత్త ఛార్జీలను సిద్ధం చేసింది. గతేడాది వివిధ కేటగిరీల వాహనాలకు సంబంధించి 8 శాతం నుంచి 15 శాతం వరకు ధరలు పెంచగా.. ఈసారి వాహనదారులపై కాస్త దయతలిచి 5.50 శాతంలోపే పెంపును పరిమితం చేసింది.హైదరాబాద్‌-విజయవాడ (65) జాతీయ రహదారిని ఉదాహరణగా తీసుకుంటే.. ఈ హైవేపై తెలంగాణలోని చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, రానూపోనూ కలిపి రూ.10, తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు రూ.10, ఇరు వైపులా అయితే రూ.20, అదే విధంగా బస్సు, ట్రక్కులకు రూ.25, రూ.35, భారీ రవాణా వాహనాలకు రూ.35, రూ.50 చొప్సున పెంచారు. 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు రుసుంలో 25 శాతం మినహాయింపు లభిస్తుంది. స్థానికుల నెలవారీ పాస్‌ను కూడా పెంచారు. ఆ పాసులను రూ.330 నుంచి 340కి పెంచారు. విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ ప్లాజా మీదుగా రోజుకు సుమారు 40 వేల వరకు ప్రస్తుతం వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. వారాంతపు దినాల్లో, శుభకార్యాలు అధికంగా ఉన్నప్పుడు మరో 5 వేల వాహనాలు అదనంగా వెళతాయని అధికారులు తెలిపారు. పెరిగిన టోల్‌ ధరలతో సామాన్యులపై భారం పడనుంది. 2025 మార్చి 31 వరకు పెరిగిన ధరలు అమలులో ఉండనున్నాయి.

bottom of page