ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన కొనసాగుతోందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై జగన్ స్పందించారు. రషీద్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి నెలన్నర రోజులు మాత్రమే అయిందని గుర్తుచేశారు. ఈలోపే రాష్ట్రాన్ని హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారంటూ టీడీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదని, ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కరవైందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని అణగదొక్కడమే లక్ష్యంగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రాజకీయ కక్షతో దాడులకు తెగబడుతున్నారని జగన్ విమర్శించారు. వినుకొండలో బుధవారం రాత్రి జరిగిన హత్య రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ఠ అని చెప్పారు. ఈ దారుణం ప్రభుత్వానికి సిగ్గుచేటని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని అన్నారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని విమర్శించారు.
అధికారం శాశ్వతం కాదని గుర్తెరిగి హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును జగన్ గట్టిగా హెచ్చరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. ఏపీలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా లకు విజ్ఞప్తి చేసినట్లు ట్వీట్ లో తెలిపారు. బాధితులకు పార్టీ తరఫున అండగా నిలబడతామని, అన్ని రకాలుగా ఆదుకుంటామని పార్టీ కార్యకర్తలకు జగన్ హామీ ఇచ్చారు.