top of page
MediaFx

సభలో అక్కాతమ్ముళ్ల లడాయి..!


ఈ పదేళ్లలో ఇలాంటి వాదులాట జరగడం బహుశా ఇదే మొదటిసారేమో. సీఎం రేవంత్‌రెడ్డి ఎవరి పేరు ప్రస్తావించకుండా అసెంబ్లీలో అన్న ఒకే ఒక్క మాటకు సభలో అలజడి రేగింది. ఆ మాటేంటంటే.. వెనకున్న అక్కలను నమ్మొద్దు, నమ్మితే బతుకు జూబ్లీ బస్టాండే..! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సూచించారో, ఒక సహచరుడిగా చిన్న హెచ్చరిక చేశారో గానీ.. అసెంబ్లీ ఒక్కసారిగా వేడెక్కింది.

సీఎం రేవంత్‌రెడ్డి స్టేట్‌మెంట్‌తో బీఆర్ఎస్ సభ్యులు ఊగిపోయారు. సభను ఆర్డర్‌లో పెట్టడానికి స్పీకర్‌ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఓవైపు బీఆర్ఎస్ సభ్యుల అభ్యంతరాలు.. మరోవైపు అధికారపక్షం నుంచి వాటికి సమాధానాలు. వెరసి.. తెలంగాణ అసెంబ్లీలో ఈ దశాబ్దకాలంలో కనిపించని ఓ భిన్న వాతావరణం ఆవహించింది. ముఖ్యంగా మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకుంటూ మాట్లాడ్డం, ఇరువైపుల సభ్యులు లేచి నినాదాలు చేయడంతో ఏకంగా సభనే వాయిదా వేయాల్సి వచ్చింది. వెనకున్న అక్కలను నమ్మొద్దు.. మోసం చేస్తారన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు.. ‘నేనేం మోసం చేశా.. నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారు’ అంటూ కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు సబితా ఇంద్రారెడ్డి. దీనికి సమాధానంగా ‘ఎందుకు అలా అన్నానంటే’ అంటూ వివరణ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. సీఎం రేవంత్‌రెడ్డికి సభ మొత్తం సపోర్టుగా నిలబడితే.. సబితకు మద్దతుగా బీఆర్ఎస్ సభ్యులు పోడియం వరకు వచ్చేశారు. అయితే.. సబితాను ఎందుకు అలా అనాల్సి వచ్చిందో, సీఎం రేవంత్‌రెడ్డి మనసులోని ఆవేదనేంటో తనకు తెలుసంటూ కౌంటర్‌ ఇచ్చారు మంత్రి సీతక్క. మంత్రి కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన సూచన కరెక్టేనంటూ గతంలో జరిగిన ఓ సంఘటనను సభలో వివరించి చెప్పారు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క.

అక్కతమ్ముళ్ల మధ్య జరిగిన లడాయితో సభ మొత్తం హోరెత్తిపోయింది. సబితకు సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వాలంటూ పోడియంను చుట్టుముట్టే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్‌ సభ్యులు. ఎంఐఎం కూడా సబితకు ఛాన్స్ ఇవ్వాలనే కోరింది. కాని, సభ ఆర్డర్‌లో లేకపోవడంతో స్పీకర్‌ ప్రసాద్.. అసెంబ్లీని వాయిదా వేశారు. అయినా సరే.. రచ్చ ఆగలేదు. బయటికొచ్చిన సబిత ఇంద్రారెడ్డి.. మీడియా ముందు మరోసారి కంటతడి పెట్టుకున్నారు. సబితకు తోడుగా మాజీ మంత్రులు కేటీఆర్, సునీత లక్ష్మారెడ్డి కూడా మాట్లాడారు.

సభను వాయిదా వేయడం.. బయటికొచ్చిన తరువాత బీఆర్ఎస్ సభ్యులు మీడియా ముందుకు రావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కౌంటర్స్ ఇచ్చారు. మరోవైపు సభలో సబిత ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేస్తోంది బీఆర్ఎస్. సబితకు సీఎం రేవంత్‌ క్షమాపణ చెప్పాలని కూడా పట్టుబడుతోంది.

bottom of page