top of page
MediaFx

ఇళయరాజా నోటీసుల పై స్పందించిన మేకర్స్..

చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాలను అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో మంజుమ్మెల్ బాయ్స్ సినిమా ఒకటి. మలయాళంలో తెరకెక్కిన ‘ మంజుమ్మెల్ బాయ్స్ ‘ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ‘మంజుమేల్ బాయ్స్’ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం, ఈ చిత్రానికి కమల్ హాసన్ నటించిన తమిళ చిత్రం ‘గుణ’తో లింక్ ఉంది. ‘గుణ’ సినిమా షూటింగ్ జరిగిన గుహలోకి వెళ్తుండగా జరిగిన ప్రమాదం, అనుకోని ఆ ప్రమాదం నుంచి స్నేహితుల బృందం ఎలా బయటపడిందన్నదే ఈ సినిమా కథాంశం. తమిళ సినిమా గుణలోని సూపర్ హిట్ పాట ‘కణ్మణి అంబోడ’ని పాట గుర్తుందా.? తెలుగులోనూ ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.  ఆ పాట సినిమాకే హైలైట్‌. కానీ ‘గుణ’ సినిమా సంగీత దర్శకుడు ఇళయరాజా మాత్రం అనుమతి లేకుండా తన పాటను వాడుకున్నందుకు ‘మంజుమేల్ బాయ్స్’ చిత్ర నిర్మాతలకు నోటీసులిచ్చాడు. ఇప్పుడు ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడు ఇళయరాజా నోటీసులపై నిర్మాతలు స్పందించారు. ‘మంజుమేల్ బాయ్స్’ చిత్ర నిర్మాతలకు నోటీసులిచ్చిన ఇళయరాజా.. తన పాటలన్నింటికీ అసలు యజమాని తానేనని, ఫంక్షనల్ రైట్స్ తనవేనని చెప్పుకొచ్చారు. ‘మంజుమేల్ బాయ్స్’ సినిమా నిర్మాతలు తమ సినిమాలో నా మ్యూజిక్ కంపోజిషన్‌ని ఉపయోగించుకోవడానికి నా అనుమతి తీసుకోలేదు, టైటిల్ కార్డ్‌లో నా పేరు వేసినంత మాత్రానా.. వారు నా అనుమతి తీసుకున్నారని కాదు అని తెలిపారు ఇళయరాజా.

ఇప్పుడు ఈ విషయమై ‘మంజుమేల్ బాయ్స్’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన షాన్ ఆంటోని మాట్లాడుతూ.. ‘గుణ’ సినిమా ఆడియో హక్కులు రెండు సంస్థల వద్ద ఉన్నాయి. రెండు సంస్థల నుంచి మేము అనుమతి తీసుకున్నాం. సినిమా విడుదలైన తర్వాత చిత్ర బృందం ఆ సినిమా హీరో కమల్‌హాసన్‌తో కూడా మాట్లాడింది. ఇళయరాజా గతంలో కూడా చాలా మందికి ఇలాంటి నోటీసులు పంపారు. ఇళయరాజా స్వరపరిచిన పాటలను వాడుకోవడమే కాకుండా లైవ్ షోలలో తన పాటలు పాడిన వారికి, తన పేరు వాడుకున్నందుకు నోటీసులు పంపారు. ఇళయరాజా తన సన్నిహితుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కూడా నోటీసులు ఇచ్చారు. అప్పట్లో అది పెను వివాదానికి కారణమైంది.

bottom of page