top of page
MediaFx

కేసీఆర్ రైతును రాజు చేస్తే.. రేవంత్ రైతు ప్రాణాల‌ను తీస్తున్నాడు : కేటీఆర్


అధికార కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌సాయ రంగాన్ని తీవ్ర నిర్ల‌క్ష్యం చేస్తోంది. రుణ‌మాఫీ కాలేద‌ని కొంద‌రు.. రైతు భ‌రోసా అంద‌క ఇంకొంద‌రు అన్న‌దాత‌లు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. అన్నదాత‌ల ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగా మారినా.. కాంగ్రెస్ స‌ర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదంటూ బీఆర్ఎస వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ రైతును రాజు చేస్తే.. ఈ కాంగ్రెస్ స‌ర్కార్ అన్న‌దాతల ప్రాణాల‌ను తీస్తుందంటూ ధ్వ‌జ‌మెత్తారు. రైతు రుణ‌మాఫీ బోగ‌స్.. రైతు భ‌రోసా కూడా బోగ‌స్ అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నిన్న సురేంద‌ర్ రెడ్డి.. నేడు సాగ‌ర్ రెడ్డి..

అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా రుణమాఫీ కాకపోవడంతో మేడ్చల్‌లో వ్యవసాయ కార్యాలయం సాక్షిగా రైతు సురేంద‌ర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లికి, తనకు ఉన్న రుణం మాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దగాకు బలైపోయాడ‌ని కేటీఆర్ తెలిపారు. భార్యాభర్తలిద్దరిలో ఒక్కరి కూడా రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో జగిత్యాలలో పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు రైతు సాగ‌ర్ రెడ్డి. తన పేరిట ఉన్న లక్షన్నర రుణం, తన భార్య పేరిట ఉన్న లక్షా 60 వేల రుణంలో ఏ ఒక్కరి రుణం మాఫీ అయినా గట్టెక్కుతానని గంపెడాశలు పెట్టుకుని దారుణంగా మోసపోయాడని కేటీఆర్ పేర్కొన్నారు.

మాట తప్పిన సీఎంను ఏం చేయాలి..?

ముఖ్యమంత్రి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలను బలిపెట్టాలి..? ఏకకాలంలో అందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాటతప్పిన సీఎంను ఏం చేయాలి..? డిసెంబర్‌లో పెట్టిన డెడ్ లైన్ సెప్టెంబర్ దాటినా అమలుకాకపోతే దగాపడ్డ అన్నదాతలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలి..? రూ. 49,500 వేల కోట్ల రుణమాఫీలో పావుశాతం కూడా చేయకుండా చేతులెత్తేసినందుకు రైతన్నలకు క్షమాపణలు చెప్పాలి రేవంత్ స‌ర్కార్. ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్ళు చల్లారుతాయి? రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రలు చేయటం కాదు రాష్ట్రం లో ఏం జరుగుతుందో చూడు.. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. దైర్యంగా ఉండాలని కోరుతున్నాను అని కేటీఆర్ తెలిపారు.



bottom of page